Republic Day: నియంతృత్వ ధోరణిని తెలంగాణ సమాజం సహించదు: గవర్నర్ తమిళిసై

Telangana Governor Tamilisai addresses people on Republic in Republic day

  • హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జాతీయ జెండా ఆవిష్కరణ
  • ప్రజలను ఉద్దేశించి ప్రసంగం
  • విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని పునర్నిర్మించుకుందామని పిలుపు
  • సంక్షేమంలో తమ ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని వ్యాఖ్య

మహోన్నతమైన మన రాజ్యాంగాన్ని రాజ్యాంగకర్తలు ఎంతో ముందు చూపుతో తయారు చేశారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్..సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. 

నియంతృత్వ ధోరణిని తెలంగాణ సమాజం సహించదు..
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ‘‘బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాజ్యంగం మార్గదర్శకత్వంలో ముందుకెళ్లడం గర్వించదగ్గ విషయం. ఆ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు ముందుకెళ్తే ప్రజలు ఊరుకోరు. గడిచిన పదేళ్లల్లో అలాగే వ్యవహరించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే రాష్ట్రం సాధించుకున్నాం. నియంతృత్వం ధోరణితో వెళ్లడాన్ని తెలంగాణ సమాజం సహించదు. ఎన్నికల్లో తీర్పు ద్వారా నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అహంకారం, నియంతృత్వం చెల్లవని విస్పష్టమైన తీర్పు ఇచ్చారు.

విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని పునర్నిర్మించుకుందాం..
విధ్వంసానికి గురైన వ్యవస్థలను పునర్నిర్మించుకుందాం. రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలిస్తేనే పేదవాడికి అభివృద్ధి ఫలాలు అందుతాయి. ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి శోభనివ్వవు. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే లక్ష్యం. ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైంది. మహాలక్ష్మి కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. మిగతా గ్యారంటీలనూ అమలు చేస్తాం. గాడితప్పిన వ్యవస్థలను సరిదిద్దుకుంటూ ముందెకెళుతున్నాం. అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడేలా ప్రణాళికలు రచిస్తున్నాం.

సంక్షేమంలో సరికొత్త అధ్యాయం.. 
సంక్షేమంలో సరికొత్త అధ్యాయం లిఖించేలా కొత్త ప్రభుత్వ పాలన ఉంటుంది. యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెడతాం. టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతాం. దీనిపై ఎలాంటి అపోహలకూ యువత లోనుకావొద్దు’’ అని గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. దావోస్ సదస్సులో రూ.40 వేల కోట్ల ఒప్పందాలు కుదిరాయన్నారు. ఇందుకు సీఎం, ఆయన బృందాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News