Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి జకోవిచ్ అవుట్... జానిక్ సిన్నర్ సంచలనం

Jannik Sinner outplays defending champ Novak Djokovic in Asutralian Open semis
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ లో జకోవిచ్ ఓటమి
  • జకో 33 మ్యాచ్ ల విజయ ప్రస్థానానికి అడ్డుకట్ట వేసిన జానిక్ సిన్నర్
  • కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరిన ఇటలీ యువ ఆటగాడు
డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిచ్ కు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో దిగ్భ్రాంతికర ఓటమి ఎదురైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఇవాళ జరిగిన సెమీఫైనల్లో ఇటలీ ఆటగాడు జానిక్ సిన్నర్ 6-1, 6-2, 7-6, 6-3తో జకోవిచ్ ను మట్టికరిపించాడు. తద్వారా జకోవిచ్ 33 మ్యాచ్ ల విజయప్రస్థానానికి అడ్డుకట్ట వేశాడు. 

ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను రికార్డు స్థాయిలో 10 సార్లు గెలిచిన సెర్బ్ వీరుడు జకోవిచ్ ఇవాళ సిన్నర్ ముందు ఓ సాధారణ ఆటగాడిలా కనిపించాడు. అటు సర్వీసులు, ఇటు బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్ షాట్లతో విజృంభించిన నాలుగో సీడ్ సిన్నర్ మూడు సెట్లలోనే మ్యాచ్ ను ముగించే ఊపులో కనిపించాడు. 

అయితే మూడో సెట్ లో ఎదురుదాడికి దిగిన జకోవిచ్ ఆ సెట్ ను టైబ్రేకర్ వరకు తీసుకెళ్లి విజయం సాధించాడు. కానీ నాలుగో సెట్ సిన్నర్ దే హవా నడిచింది. పలుమార్లు జకోవిచ్ సర్వీసును బ్రేక్ చేసిన సిన్నర్ చివరికి మ్యాచ్ ను కైవసం చేసుకున్నాడు. 

తొలి రెండు సెట్లలోనే జకోవిచ్ 29 అనవసర తప్పిదాలకు పాల్పడడం ఓటమికి దారితీసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెమీస్ చేరిన ప్రతిసారీ గెలుస్తూ వచ్చిన జకోవిచ్ కు నేడు పరిస్థితి ప్రతికూలంగా మారింది. 22 ఏళ్ల సిన్నర్ చూస్తుండగానే మ్యాచ్ ను లాగేసుకున్నాడు. 2019 నుంచి ఇక్కడ ఓటమన్నది ఎరుగని జకోవిచ్ కు ఈ ఇటలీ యువ కిశోరం ఓటమి రుచిచూపించాడు. 

కాగా, జానిక్ సిన్నర్ తన కెరీర్ లో ఓ గ్రాండ్ స్లామ్ ఓపెన్ లో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఆదివారం జరిగే ఫైనల్లో సిన్నర్... మెద్వెదెవ్/జ్వెరెవ్ లలో ఒకరిని ఎదుర్కొంటాడు. ఇవాళ జరిగే రెండో సెమీఫైనల్లో డానిల్ మెద్వెదెవ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ తలపడనున్నారు.
Australian Open
Jannik Sinner
Novak Djokovic
Semifinal
Grandslam
Tennis

More Telugu News