Harish Rao: బీఆర్ఎస్ హయాంలో విచారణ చేసి ఉంటే ఎన్ని కేసులు పెట్టి ఉండేవాళ్లమో: హరీశ్ రావు
- పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు
- ప్రాజెక్టుల అప్పగింత విషయంలో కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని ఆరోపణ
- కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగా మాట్లాడుతున్నారన్న హరీశ్ రావు
బీఆర్ఎస్ హయాంలో విచారణలు చేసి ఉంటే మేం ఎన్ని కేసులు పెట్టి ఉండేవాళ్లమో అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ... కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత సహా విభజన హామీలు, బీసీ జనగణన తదితర అంశాలపై ఎంపీలు పార్లమెంటులో గట్టిగా గళం వినిపించాలని సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. ప్రాజెక్టుల అప్పగింత విషయంలో కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. ఆ పార్టీల నేతలు తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో విఫలమయ్యారన్నారు. వివిధ అంశాలపై ఆయా శాఖల కేంద్రమంత్రులను కలవాలని నిర్ణయించామన్నారు.
గత పదేళ్ళుగా తాము కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు ఇవ్వలేదన్నారు. ఎలాంటి స్పష్టత లేకుండా ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి ఇవ్వలేమని స్పష్టం చేశామన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే బోర్డు పరిధిలోకి ఇచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని... వారి అహంకార వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై కాకుండా ప్రతిపక్షాలపై దృష్టి సారించిందన్నారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారని... ఎన్నికల కోడ్ను చూపించి తప్పించుకోవద్దన్నారు.