Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు షాక్.. పరువునష్టం కేసులో జర్నలిస్టుకు 83.3 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశం
- అత్యాచారం చేయలేదని బుకాయించి ట్రంప్ తన ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ జర్నలిస్ట్ జీనో కారోల్ దావా
- ట్రంప్‌ను దోషిగా తేల్చి భారీ జరిమానా విధించిన న్యూయార్క్ కోర్టు
- ట్రంప్ తనపై అత్యాచారం చేశాడన్న కారోల్.. ఖండించిన మాజీ అధ్యక్షుడు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో జీన్ కారోల్ అనే ప్రముఖ జర్నలిస్టు, మాజీ అడ్వైజ్ కాలమిస్టుకు 83 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యూయార్క్ సిటీ కోర్టు జ్యూరీ శుక్రవారం తీర్పునిచ్చింది. తనపై అత్యాచారాన్ని తిరస్కరించడం ద్వారా ట్రంప్ తన విశ్వసనీయతను దెబ్బతీశాడని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని జీన్ కారోల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు.
1990లలో మాన్‌హట్టన్‌లోని ఒక అత్యున్నత విభాగం స్టోర్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారం చేశారని కారోల్ ‘వాట్ డూ వి నీడ్ మెన్ ఫర్? ఎ మోడెస్ట్ ప్రొపజల్’ అనే పుస్తకంలో రాసుకున్నారు. దీనిని జూన్ 2019లో ‘న్యూయార్క్ మ్యాగజైన్’ ప్రచురించింది. అయితే ఇదంతా అసత్య ప్రచారమని, అత్యాచారం అవాస్తవమని ట్రంప్ ఖండించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేశారని, కారోల్ ఒక అబద్ధాల కోరు అని ట్రంప్ విరుచుకుపడ్డారు. అసలు ఆమెను తాను ఎప్పుడూ కలవలేదని కూడా ఆయన ఖండించారు.
అయితే 2019లో ట్రంప్ చేసిన తప్పుడు ప్రకటన తన ప్రతిష్ఠను దెబ్బతీసిందని, మానసిక క్షోభకు కారణమైందని ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. తన కెరీర్‌ను ట్రంప్ దెబ్బతీశారని, తనపై లైంగిక వేధింపులకు పాల్పడింది నిజమని పేర్కొన్నారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ట్రంప్ తన పరువు తీశారని ఆరోపిస్తూ జనవరి 2022లో ఆమె ప్రత్యేక వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యూయార్క్ సిటీ కోర్టు జ్యూరీ శుక్రవారం తీర్పునిచ్చింది. నష్టపరిహారంగా 18.3 మిలియన్ డాలర్లు, శిక్షాత్మక నష్టపరిహారంగా 65 మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ నిర్ణయించింది. ట్రంప్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు ఈ మేరకు పెద్ద మొత్తంలో పరిహారం విధించింది. ఈ తీర్పుపై ‘ఇవి అమెరికా కోర్టులు కావు’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ తీర్పుని ఉన్నతస్థాయి న్యాయస్థానంలో సవాలు చేయాలని ట్రంప్ తరపు న్యాయవాది వెల్లడించారు.