Harirama Jogaiah: జనసేనకు 30 సీట్లేనా?... పొత్తులపై హరిరామజోగయ్య లేఖ
- ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు
- జనసేనకు తక్కువ సీట్లు కేటాయిస్తే అదొక విఫల ప్రయోగం అవుతుందున్న జోగయ్య
- పవన్ ఆశయ సాధనకు కనీసం 50 సీట్లు కేటాయించాలని డిమాండ్
- జనసేన ఎదుగుదలకు టీడీపీయే అడ్డుగా ఉందా? అంటూ ప్రశ్న
ఏపీలో జనసేన పార్టీ పొత్తులపై మాజీ మంత్రి హరిరామజోగయ్య ఆసక్తికర లేఖ రాశారు. ఎన్నికల నేపథ్యంలో జనసేనకు 25 నుంచి 30 సీట్లు కేటాయిస్తే అదొక విఫల ప్రయోగంగా మిగిలిపోతుందని హరిరామజోగయ్య హెచ్చరించారు. పవన్ కల్యాణ్ ఆశయ సాధన కోసం 25-30 సీట్లు సరిపోవని స్పష్టం చేశారు.
పొత్తులో భాగంగా జనసేనకు 50 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాలు కేటాయించాలని పేర్కొన్నారు. 2019లో జనసేన తరఫున పోటీ చేసి ఓటమిపాలైన నాయకులు 2024 ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని హరిరామజోగయ్య వివరించారు.
జనసేన రాజకీయ ఎదుగుదలకు టీడీపీ అడ్డుగా ఉందా? పవన్ కల్యాణ్ పెద్ద మనసుతో సర్దుకుపోవడమే కారణమా? అంటూ తన లేఖలో ప్రశ్నించారు. పొత్తు ధర్మానికి తూట్లు పొడిచేలా టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని హరిరామజోగయ్య ఆరోపించారు.
అదే సమయంలో, పొత్తులో భాగంగా జనసేనకు తక్కువ సీట్లు కేటాయిస్తారన్న సంకేతాలు ఆశావహులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తున్నాయని తెలిపారు.