KCR: ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్న కేసీఆర్

KCR to take oath as MLA on February 1
  • అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలిచిన కేసీఆర్
  • సమీప బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై 45,000 మెజార్టీతో విజయం
  • కామారెడ్డి నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన కేసీఆర్
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. స్పీకర్ సమక్షంలో ఆయన ప్రమాణం చేస్తారు. గజ్వేల్ నుంచి గెలిచిన కేసీఆర్ ఆసుపత్రిలో చేరడంతో ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి తన ఫాంహౌస్‌లో బాత్రూంలో కాలు జారిపడ్డారు. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆయన కోలుకున్నారు. దీంతో త్వరలో ప్రమాణం చేయనున్నారు.

గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ వరుసగా మూడోసారి విజయం సాధించారు. ఇటీవలి ఎన్నికల్లో సమీప బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై 45 వేల మెజార్టీతో విజయం సాధించారు. కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసినప్పటికీ బీజేపీ నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి చేతిలో ఓడిపోయారు. కామారెడ్డి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పోటీ చేశారు. కానీ నాటి ముఖ్యమంత్రి అభ్యర్థులు కేసీఆర్, రేవంత్ రెడ్డిలని ఓడించి వెంకటరమణారెడ్డి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. 

ఎన్నికల్లో గెలిచిన వారిలో చాలామంది గత డిసెంబర్ నెలలోనే ప్రమాణం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులచే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ అయ్యాకే ప్రమాణం చేశారు.
KCR
BRS
MLA
Oath
Telangana
TS Politics

More Telugu News