Harish Rao: 10 సీట్లు వచ్చినప్పుడే వెనకడుగు వేయలేదు.. ముళ్లబాట.. పూలబాట చూశాం: హరీశ్ రావు
- కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి గెలిచిందన్న హరీశ్ రావు
- బీఆర్ఎస్ 1.08 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయిందని వెల్లడి
- లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ బిందెలు కనిపించాయన్న రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్
మనకు 10 సీట్లు వచ్చినప్పుడు కూడా వెనకడుగు వేయలేదని... బీఆర్ఎస్ ముళ్ల బాట... పూలబాట రెండింటినీ చూసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలోని ఓ గార్డెన్‌లో ఈ రోజు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.08 శాతం ఓట్ల తేడాతో మనం అధికారం కోల్పోయామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి గెలిచిందని ఆరోపించారు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, దాడులు, బెదిరింపులు కొత్త కాదన్నారు.
తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ ఎత్తుపల్లాలను ఎన్నింటినో చూసిందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ, వడ్లకు రూ.5వేల బోనస్, రూ.4వేల పెన్షన్, కరెంట్ బిల్లుల మాఫీ వంటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. సచివాలయంలో లంకె బిందెలు ఉన్నాయని వస్తే... ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. లంకె బిందెలు ప్రభుత్వ భవనాల్లో ఉంటాయా? లేక పాడుబడిన ఇళ్లలో ఉంటాయా? అని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నవాళ్లకు ఓపిక ఉండాలని హితవు పలికారు. ఇచ్చిన హామీలను ఎలా ఎగ్గొట్టాలా? అని కాంగ్రెస్ ఆలోచన చేస్తోందని ఆరోపించారు. అందుకే అప్పులు.. లంకె బిందెలు అంటూ సాకులు చెబుతోందన్నారు.
మహాలక్ష్మిలో భాగంగా మహిళలకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరా పారడం లేదని మంత్రి కొండా సురేఖ ఆరోపించడం విడ్డూరమన్నారు. రంగనాయకసాగర్ గేట్లు ఎలా వదిలారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది కేవలం బీఆర్‌ఎస్సే అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.