Gyanvapi Mosque: ‘జ్ఞానవాపి’ కింద దేవాలయం ఉన్నట్టు ఏఎస్ఐ రిపోర్టుపై స్పందించిన ముస్లిం పర్సనల్ లా బోర్డు
- జ్ఞానవాపి మసీదు కింద దేవాలయం ఉన్నట్టు ఏఎస్ఐ రిపోర్టులో నిర్ధారణ కాలేదని వ్యాఖ్య
- కొన్ని మతవాద సంస్థలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపణ
- సమాజంలో అశాంతిని రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం
జ్ఞానవాపి మసీదు కింద దేవాలయం ఉన్నట్టు ఏఎస్ఐ గుర్తించిందన్న వార్తలపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎమ్పీఎల్బీ) స్పందించింది. ఈ వార్తల్ని తోసిపుచ్చిన లా బోర్డు.. ఏఎస్ఐ నివేదికలో ఈ విషయం పూర్తిస్థాయిలో నిర్ధారణ కాలేదని వ్యాఖ్యానించింది. ఏఐఎమ్పీఎల్బీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాసిమ్ రసూల్ ఇలియాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో ఏఎస్ఐ రిపోర్టు నిర్ణయాత్మకమైన ఆధారం కాదని అభిప్రాయపడ్డారు. కొన్ని మతవాద సంస్థలు జ్ఞానవాపి మసీదు విషయంలో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. సమాజంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
అంతకుమునుపు హిందు పిటిషనర్ల తరపున న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ ఏఎస్ఐ రిపోర్టును ప్రస్తావించారు. 17వ శతాబ్దంలో ఓ హిందూదేవాలయాన్ని కూలగొట్టి జ్ఞానవాపి మసీదు నిర్మించారనే ఆధారాలు ఉన్నట్టు ఏఎస్ఐ గుర్తించిందని పేర్కొన్నారు.
కాగా.. ఏఎస్ఐ రిపోర్టును తన లీగల్ టీం సాయంతో పూర్తిగా చదివాక గానీ దీనిపై స్పందించనని జ్ఞానవాపి మసీదు వ్యవహారాలు చూస్తున్న అంజుమన్ ఇంతెజామియా మస్జిద్ కమిటీ (ఏఐఎమ్సీ) పేర్కొంది.
హిందూ మహిళ పిటిషనర్ల తరుపు లాయర్ శుభాష్ నందన్ చతుర్వేదీ మాట్లాడుతూ ఏఎస్ఐ సర్వే శాస్త్రీయమైనదని వ్యాఖ్యానించారు. సర్వే రీపోర్టు అధీకృతమైనదని, అందులో అన్ని విషయాలు స్పష్టమయ్యాయని పేర్కొన్నారు.