Chandrababu: జగన్ కేవలం బిల్డప్ బాబాయ్... ఆయనకేమీ తెలియదు: టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్
- టీడీపీ-జనసేన గెలుపుని ఎవరూ ఆపలేరన్న టీడీపీ అధినేత
- 175 సీట్లు గెలుస్తామంటున్న జగన్ పులివెందులలో గెలవాలని సవాల్
- పత్తికొండలో టీడీపీ ‘రా.. కదలిరా.. ’ బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు
కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన టీడీపీ ‘రా... కదలి రా’ బహిరంగ సభలో అధికార వైసీపీపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శల దాడి చేశారు. జగన్ కేవలం బిల్డప్ బాబాయ్ అని, ఆయనకేమీ తెలియదని ఎద్దేవా చేశారు.
మొత్తం 175 సీట్లూ గెలుస్తామని జగన్ అంటున్నారని, జగన్ ముందు పులివెందులలో గెలవాలని సవాల్ చేస్తున్నా అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలోని 10 మంది మంత్రులు ఈసారి పోటీ చేయడం లేదని ఎద్దేవా చేశారు.
నంద్యాలలోని ముస్లిం వర్గానికి ఏమైనా సాయం చేశారా? అని జగన్ను ప్రశ్నించారు. వేధింపులు తాళలేక అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ప్రస్తావించారు. తమ ప్రభుత్వంలో అందించిన రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలు తీసేశారని విమర్శించారు.
ఈ ప్రభుత్వం ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేసిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కర్నూలు జిల్లా నుంచే ఎక్కువ వలసలు ఉన్నాయని, టీడీపీ అధికారంలోకి వస్తే కర్నూలు జిల్లాకు సాగునీరు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
బీసీలను అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత తనదని అన్నారు. జగన్ పాలనలో బీసీలపై దాడులు జరిగాయని, వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.
జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. యువతకు జాబ్ రావాలంటే బాబు రావాలని నినాదమిచ్చారు. యువగళం కింద ఏటా 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, యువత ఎక్కడికీ వెళ్లనక్కర్లేదని, ఇంట్లో కూర్చునే పని చేసుకోవచ్చని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జగన్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, నిరుద్యోగుల్లో బాధ కనిపిస్తోందని జగన్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి లేక వలసలు వెళుతున్నారని, ప్రజలకు భరోసా ఇచ్చేందుకే తాను వచ్చానని ఆయన అన్నారు. కాగా పత్తికొండ సభకు టీడీపీ శ్రేణులు, జనం పెద్ద సంఖ్యలో వచ్చారు.