Mona Lisa: అద్భుత కళాఖండం మోనాలిసా చిత్రపటంపై మరోసారి దాడి
- పారిస్ లో బుల్లెట్ ప్రూఫ్ షోకేస్ లో ఉన్న మోనాలిసా చిత్రపటం
- ఫ్రాన్స్ లో పర్యావరణ ఉద్యమకారుల నిరసన
- మోనాలిసా చిత్రపటంపై సూప్ పోసిన నిరసనకారులు
ప్రఖ్యాత చిత్రకారుడు లియొనార్డో డావిన్సి కుంచె నుంచి ప్రాణం పోసుకున్న మోనాలిసా చిత్రపటం చరిత్రలో ఓ అద్భుత కళాఖండంగా నిలిచిపోయింది. ప్రస్తుతం మోనాలిసా చిత్రపటాన్ని పారిస్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తో తయారుచేసిన షోకేస్ లో ఉంచారు.
అయితే, పారిస్ లో మోనాలిసా చిత్రపటం మరోసారి దాడికి గురైంది. ఫ్రాన్స్ లో వ్యవసాయ రంగ విధానాలను వ్యతిరేకిస్తున్న పర్యావరణ ఉద్యమకారులు మోనాలిసా చిత్రపటంపై సూప్ పోశారు.
పారిస్ లో నిరసన చేపట్టిన పర్యావరణ ఉద్యమకారులు... మోనాలిసా చిత్రపటంపై సూప్ పోసిన తర్వాత... మీకు ఇలాంటి కళాఖండాలు ముఖ్యమా? ఆరోగ్యకరమైన, సుస్థిరమైన ఆహార వ్యవస్థ ముఖ్యమా? అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులు రిపోస్టే అలిమెంటైర్ అనే ఫ్రెంచ్ సంస్థకు చెందినవారిగా గుర్తించారు.
16వ శతాబ్దానికి చెందిన మోనాలిసా చిత్రపటం ఇప్పటివరకు అనేక దాడులకు గురైంది. 1911లో ఈ వర్ణచిత్రం ఓ మ్యూజియం ఉద్యోగి చేతిలో చోరీకి గురైంది. 1950లో దీనిపై యాసిడ్ దాడి కూడా జరిగింది. అప్పటినుంచి దీన్ని బుల్లెట్ ప్రూఫ్ తో చేసి గ్లాస్ షోకేస్ లో ఉంచి ప్రదర్శిస్తున్నారు.