India: అండర్-19 వరల్డ్ కప్: అమెరికాపై ఘనంగా నెగ్గిన భారత కుర్రాళ్ల జట్టు
- దక్షిణాఫ్రికా గడ్డపై అండర్-19 వరల్డ్ కప్
- బ్లూంఫోంటీన్ లో భారత్ వర్సెస్ అమెరికా
- 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసిన భారత్
- 50 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు చేసిన అమెరికా
- 201 పరుగుల తేడాతో భారత్ జయభేరి
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో భారత కుర్రాళ్ల జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకుంది. అమెరికాపై 201 పరుగుల తేడాతో నెగ్గింది.
బ్లూంఫోంటీన్ లో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన అమెరికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ అండర్-19 జట్టు పరుగుల విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది.
ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (108) సెంచరీతో మెరిశాడు. ముషీర్ ఖాన్ 73, కెప్టెన్ ఉదయ్ సహారన్ 35, ప్రియాన్షు మోలియా 27, సచిన్ దాస్ 20, ఆదర్శ్ సింగ్ 25 పరుగులు చేశారు. అమెరికా బౌలర్లలో అతీంద్ర సుబ్రమణియన్ 2, ఆర్య గార్గ్ 1, ఆరిన్ నాద్ కర్ణి 1, కెప్టెన్ రిషి రమేశ్ 1 వికెట్ తీశారు.
అనంతరం, 327 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అమెరికా జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులే చేసింది. అమెరికా జట్టులో ఉత్కర్ష్ శ్రీవాస్తవ 40, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అమోఘ్ ఆరేపల్లి 27 పరుగులు చేశారు. చివర్లో ఆరిన్ నాద్ కర్ణి 20 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో నమన్ తివారీ 4, రాజ్ లింబానీ 1, సౌమీ పాండే 1, మురుగున్ అభిషేక్ 1, ప్రియాన్షు మోలియా 1 వికెట్ తీశారు.
రిషి రమేశ్ (కెప్టెన్), ప్రణవ్ చెట్టిపాళయం, భవ్య మెహతా, సిద్ధార్థ్ కప్పా, ఉత్కర్ష్ శ్రీవాస్తవ, అమోఘ్ ఆరేపల్లి, మానవ్ నాయక్, పార్థ్ పటేల్, ఆరిన్ నాద్ కర్ణి, అతీంద్ర సుబ్రమణియన్, ఆర్య గార్గ్.... వారి పేర్లు ఇలా ఉన్నాయి. అమెరికా అన్న పేరు తప్ప, అంతా భారతీయమే కనిపిస్తోంది.