Allahabad High Court: ఉద్యోగం లేకున్నా సరే భార్యకు భరణం చెల్లించాల్సిందే.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
- నెలకు రూ. 2 వేల చొప్పున భరణం ఇవ్వాలన్న ట్రయల్ కోర్టు
- హైకోర్టులో సవాలు చేసిన భర్త
- ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించిన ఉన్నత న్యాయస్థానం
- కూలి చేసినా రోజుకు రూ. 350-400 వస్తాయన్న కోర్టు
భరణం విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగం లేకున్నా సరే తన నుంచి విడిపోయిన భార్యకు భరణం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. కూలి పని చేసినా రోజుకు రూ. 350 నుంచి 400 వరకు వస్తాయని జస్టిస్ రేణు అగర్వాల్ తీర్పు చెప్పారు. తన నుంచి విడిపోయిన భార్యకు నెలకు రూ. 2 వేల చొప్పున భరణం చెల్లించాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నావోకు చెందిన వ్యక్తి హైకోర్టులో చాలెంజ్ చేశాడు.
గ్రాడ్యుయేట్ అయిన తన భార్య టీచర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 10 వేలు సంపాదిస్తోందని, తాను అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నానని రివిజన్ పిటిషన్‌లో పేర్కొన్న ఆయన ఈ విషయాలను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నాడు. విచారించిన హైకోర్టు.. భార్య టీచర్‌గా పనిచేస్తున్నట్టు రుజువులు సమర్పించాలని కోరింది. పిటిషనర్ ఆరోగ్యంగా ఉండడంతో డబ్బు సంపాదించే సామర్థ్యం ఉందని, కాబట్టి భార్యకు భరణం చెల్లించాల్సిందేనని స్పష్టంగా తీర్పు చెప్పింది.