Narsa Reddy: మాజీ పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి కన్నుమూత.. సీఎం రేవంత్ సంతాపం
- 1972 నుంచి రెండేళ్ల పాటు పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన నర్సారెడ్డి
- జలగం వెంగళరావు హయాంలో మంత్రిగా పని చేసిన నర్సారెడ్డి
- గత కొంతకాలంపాటు అనారోగ్యంతో బాధపడిన వైనం
పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. 1972 నుంచి రెండేళ్ల పాటు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఆయన పని చేశారు. జలగం వెంగళరావు మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గర్లో వైట్ హౌస్ లో ఆయన నివాసముంటున్నారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు.
మరోవైపు, నర్సారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా ఆయన సేవలందించారని కొనియాడారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు.