Sharad Pawar: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై శరద్ పవార్ తీవ్ర ఆగ్రహం
- ఎన్డీయేలో ఎందుకు చేరాలని అనుకున్నారో తనకైతే తెలియడం లేదన్న పవార్
- నితీశ్ కుమార్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్య
- ఇంత తక్కువ సమయంలో ఇలాంటి మార్పు చూడలేదని విమర్శ
మహాఘట్బంధన్ను వీడి... ఎన్డీయేలో చేరిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. సోమవారం ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ... నితీశ్ కుమార్ ఎన్డీయేలో చేరాలని ఎందుకు అనుకున్నారో తనకు తెలియడం లేదన్నారు. ఓవైపు ఇన్నాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన జేడీయూ అధినేత... హఠాత్తుగా ఎందుకు తన మనసును మార్చుకున్నారో తెలియదని... నితీశ్ కుమార్‌కు భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఇంత తక్కువ సమయంలో... రోజుల వ్యవధిలో ఓ నేతలో ఇలాంటి మార్పును ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని విమర్శలు గుప్పించారు.
బీజేపీ వ్యతిరేక కూటమిలోని పార్టీలు గతంలో పాట్నాలో సమావేశమయ్యాయని... నితీశ్ కుమార్ వారిని ఆహ్వానించారని గుర్తు చేశారు. కానీ గత పది పదిహేను రోజులుగా ఆయనలో మార్పు కనిపిస్తోందని... కూటమి సిద్ధాంతాన్ని పక్కన పెట్టారని మండిపడ్డారు. I.N.D.I.A. కూటమిలో నితీశ్ కుమార్ పాత్ర కీలకమన్నారు. ఆయన సిద్ధాంతాన్ని వదిలి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదన్నారు.