Anam Ramanarayana Reddy: స్పీకర్ తమ్మినేని విచారణ ఒక ప్రహసనంలా ఉంది: ఆనం రామనారాయణరెడ్డి
- వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టిన స్పీకర్ తమ్మినేని
- హాజరైన కోటంరెడ్డి, ఆనం, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవి
- వాదనలు వినిపించడానికి నాలుగు వారాల సమయం అడిగామన్న ఆనం
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈరోజు విచారణ చేపట్టారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి విచారణకు హాజరయ్యారు.
విచారణ అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ... ఈ రోజు విచారణ అంతా ఒక ప్రహసనంగా ఉందని విమర్శించారు. తనపై ఫిర్యాదు చేసిన ప్రసాద్ రాజు కూడా విచారణలో ఉండాలని స్పీకర్ ను కోరానని చెప్పారు. ఒరిజినల్ సీడీలు, డాక్యుమెంట్లు, పేపర్ క్లిప్పింగ్ లు ఇవ్వాలని అడిగానని తెలిపారు. అయితే, ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పీకర్ చెప్పారని అసహనం వ్యక్తం చేశారు. తమ వాదనలు వినిపించడానికి నాలుగు వారాల సమయం అడిగామని చెప్పారు. న్యాయవాదిని పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరామని తెలిపారు. న్యాయవాదిని పెట్టుకోవడానికి సమయం ఇవ్వలేమని స్పీకర్ చెప్పారని అన్నారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... వైసీపీ నుంచి తమను బహిష్కరించారని... ఇప్పుడు తాము ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలమని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల కోసమే తమను ఎమ్మెల్యేలుగా డిస్ క్వాలిఫై చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలో స్పీకర్ రూల్ బుక్ ను కూడా విభజించారని విమర్శించారు. చివరి రోజుల్లోనైనా స్పీకర్ తమ్మినేని సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. వైసీపీలోనే జగన్ కు వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడుతున్నారని అన్నారు.