Mallikarjun Kharge: అలా జరిగితే కనుక ఓటుకు ఇదే మీకు చివరి అవకాశం... ఇక ఎన్నికలు ఉండవు: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
- భువనేశ్వర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్ధేశించి ఖర్గే ప్రసంగం
- మళ్ళీ బీజేపీ గెలిస్తే దేశంలో నియంతృత్వ పాలన వస్తుందని హెచ్చరిక
- నోటీసుల భయం వల్ల కొంతమంది కూటమి నుంచి వెళుతున్నారని వ్యాఖ్య
2024 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్రమోదీ తిరిగి అధికారంలోకి వస్తే భారతదేశంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి ఆయన మాట్లాడారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ గెలిస్తే దేశంలో నియంతృత్వ పాలన వస్తుందని హెచ్చరించారు. అప్పుడు దేశంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయన్నారు. మోదీని ఓడిస్తేనే దేశంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు. మోదీ మళ్లీ గెలిస్తే దేశ ప్రజలు వేసే చివరి ఓటు 2024 సార్వత్రిక ఎన్నికలే అవుతాయన్నారు.
ప్రతి ఒక్కరికీ నోటీసులు ఇస్తున్నారని... ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆ భయం వల్లే కొంతమంది I.N.D.I.A. కూటమి నుంచి... మరికొందరు పార్టీ నుంచి వెళుతున్నారన్నారు. 'ఇదే మీకు చివరి అవకాశం.. ఓటు వేయండి... దీని తర్వాత మోదీ గెలిస్తే ఓటింగ్ ఉండదు' అని వ్యాఖ్యానించారు. బీజేపీని, ఆ పార్టీ సైద్ధాంతిక సంస్థ ఆరెస్సెస్‌ను విషంగా ఖర్గే పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేయాలనుకుంటున్నారని... తాను 'మొహబ్బత్ కీ దుకాన్'ను ప్రారంభించానని చెప్పారని గుర్తు చేశారు. కానీ బీజేపీ, ఆరెస్సెస్‌లు 'నఫ్రత్కీ దుకాన్'కు తెరదీశారని ఆరోపించారు. ఈ కారణంగా మీరు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు విషపూరితమని... అవి మన హక్కులను హరిస్తున్నాయన్నారు.
ఒడిశా ముఖ్యమంత్రిపై విమర్శలు
ప్రధాని నరేంద్రమోదీతో ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్‌కు ఉన్న స్నేహంపై విమర్శలు గుప్పించారు. మోదీతో స్నేహం వల్ల నవీన్ పట్నాయక్‌కు ఏం లాభం జరిగింది? డబుల్ ఇంజిన్ ఒక్కసారి ఫెయిల్ అవుతోందన్నారు.
I.N.D.I.A. కూటమి నుంచి నితీశ్ కుమార్ వెళ్లిపోవడం గురించి స్పందిస్తూ... ఒక్కరు వెళ్లిపోయినంత మాత్రాన ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు. ఒక్కరు పోయినా పోయేదేమీ లేదని... వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.