Prashant Kishor: లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్.. నితీశ్ కుమార్ పచ్చి మోసగాడు: ప్రశాంత్ కిశోర్
- నితీశ్ కుమార్ చివరి ఇన్నింగ్స్ ఆడుతున్నాడన్న ప్రశాంత్ కిశోర్
- అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి 20కి మించి సీట్లు రావన్న పీకే
- నితీశ్ తో కలవడం బీజేపీకే నష్టమని వ్యాఖ్య
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం ఆయన మాట్లాడుతూ... ప్రాణం పోయినా బీజేపీతో చేతులు కలపనని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసి రోజులు కూడా గడవక ముందే ఆయన మాట తప్పారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ... రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ఇదే చివరి అవకాశమని... ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో కనపడరని చెప్పారు.
నితీశ్ కుమార్ పచ్చి మోసగాడని ప్రశాంత్ కిశోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితంలో నితీశ్ చివరి ఇన్నింగ్స్ ఆడుతున్నారని చెప్పారు. 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ పార్టీ జేడీయూకి 20కి మించి సీట్లు రావని అన్నారు. నితీశ్ ఏ కూటమిలో ఉన్నా ఇంతకు మించి సీట్లను సాధించలేరని చెప్పారు. ఒక వేళ 20 స్థానాల కంటే ఎక్కువ గెలుచుకుంటే తాను తన వృత్తిని వదులుకుంటానని సవాల్ విసిరారు.
బీజేపీతో నితీశ్ కుమార్ మైత్రి ఎక్కువ కాలం కొనసాగదని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. 2025 అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా వీరు కలిసి ఉండరని అన్నారు. నితీశ్ ను బీహార్ ప్రజలు తిరస్కరించారని... అందుకే సీఎం సీటును కాపాడుకోవడానికి ఆయన ఏమైనా చేస్తారని విమర్శించారు. బీహార్ లో అన్ని పార్టీలు పల్టూ రామ్ లే అని చెప్పారు. నితీశ్ తో కలవడం బీజేపీకే నష్టమని అన్నారు. నితీశ్ తో కలవకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే... ఎక్కువ సీట్లు గెలుచుకుని బలమైన స్థితిలో ఉండేదని చెప్పారు. బీహార్ లో నితీశ్ తో కలిసినా, కలవకపోయినా బీజేపీ పూర్తి ఆధిక్యతను కనబరుస్తుందని తెలిపారు.