Family Pension: మహిళా పింఛనుదారు పిల్లలకు కుటుంబ పెన్షన్ సౌకర్యం!
- ఉద్యోగి తదనంతరం పిల్లల్ని తొలి నామినీగా చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి
- ఈ మేరకు పౌర సర్వీసుల (ఫ్యామిలీ పెన్షన్) రూల్స్‌కు సవరణ
- భార్యాభర్తలు కోర్టుకెక్కిన సందర్భాల్లో సమస్యలు నివారించేందుకు నిర్ణయం
పెన్షన్ విధివిధానాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా పింఛనుదారులు తమ తదనంతరం పింఛన్‌ను భర్తకు బదులుగా సంతానానికి చెందేట్లు నామినీని ఎంచుకునే అవకాశం కల్పించింది. మహిళలకు సమాన హక్కులు కల్పించే దిశగా ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం, మహిళా పింఛనుదారు తన తదనంతరం కుటుంబ పింఛన్‌ను భర్తకు, అతడి మరణానంతరం పిల్లలకు చెందేలా పేర్లను ప్రతిపాదించేవారు. ఇకపై భర్తకు కాకుండా నేరుగా పిల్లలకే పింఛన్ చెల్లించడానికి వీలుగా 2021 నాటి కేంద్ర పౌర సర్వీసుల నిబంధనలను కేంద్ర పింఛన్, పింఛన్‌దారుల సంక్షేమ విభాగం సవరించింది. అయితే, ఈ సౌలభ్యం పొందాలనుకున్న పింఛనుదారులు లిఖిత పూర్వక విజ్ఞాపనను సమర్పించాల్సి ఉంటుంది.