Germany: ఈ దేశంలో వారానికి 4 రోజులే పని దినాలు
- ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల్లో వారానికి 5 రోజులే పనిదినాలు
- ఓ అడుగు ముందుకేసిన జర్మనీ
- ఫిబ్రవరి 1 నుంచి వారానికి 4 రోజుల పనిదినాలతో కొత్త విధానం
- వచ్చే ఆర్నెల్ల పాటు అమలు
ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు, ఐటీ కార్యాలయాల్లో వారానికి ఐదు రోజులే పని దినాలు ఉంటాయని తెలిసిందే. కొన్ని దేశాల ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇదే పని విధానం అమలు చేస్తున్నాయి.
అయితే, జర్మనీ ఓ అడుగు ముందుకేసి వారానికి 4 రోజులే పని దినాలుగా కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. వచ్చే ఆర్నెల్ల పాటు ఈ పద్ధతి కొనసాగనుంది.
జర్మనీ ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉంది. జర్మనీ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం మందగమనం నెలకొంది. అదే సమయంలో అధిక ద్రవ్యోల్బణం పట్టిపీడిస్తోంది. ఈ పరిస్థితులపై నిర్వహించిన అధ్యయనం... కొన్ని కీలక సిఫారసులకు బాటలు పరిచింది. వారానికి 4 రోజులే పనిచేయడం వల్ల ఉద్యోగులు తాజాగా, ఆరోగ్యకరంగా ఉంటారని, తద్వారా పనిలో చురుకుదనం పెరిగి, ఉత్పాదకత అధికమవుతుందని జర్మనీ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.
కాగా, 4 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేసేందుకు జర్మనీలోని 45 సంస్థలు ముందుకువచ్చాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. వారంలోని నాలుగు రోజుల్లో ఉద్యోగులు కొన్ని గంటల పాటే పనిచేసినా గతంలో చెల్లించిన మేరకే వేతనాలు ఇస్తారు. అయితే, గతంలో ఎంత పని చేశారో, ఈ నాలుగు రోజుల్లోనూ అదే స్థాయిలో ఉత్పాదకతను కనబర్చాల్సి ఉంటుంది.
వారానికి నాలుగు రోజుల పనిదినాల విధానం కారణంగా, ఉద్యోగులు సెలవులు పెట్టడం తగ్గుతుందని కంపెనీలు భావిస్తున్నాయి.