Kumari Aunty: 'కుమారి ఆంటీ' ఫుడ్ ట్రక్ ను అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు!
- హైదరాబాద్ లో ఫుడ్ ట్రక్ తో ఫేమస్ అయిన కుమారి ఆంటీ
- చవకగా రుచికరమైన ఆహారంతో ఆకట్టుకుంటున్న వైనం
- తన బండిని పోలీసులు ఆపేశారంటూ వాపోయిన కుమారి ఆంటీ
హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్/రోడ్ సైడ్ ఫుడ్ అంటే ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు కుమారి ఆంటీ. ఆమె అసలు పేరు దాసరి సాయి కుమారి. ఓ ఫుడ్ ట్రక్ తో హైదరాబాద్ రోడ్ల పక్కన చవకగా, రుచికరమైన వెజ్, నాన్ వెజ్ వెరైటీలతో ప్రజల కడుపు నింపుతున్న కుమారి ఆంటీ యూట్యూబ్ లో చాలా ఫేమస్.
మధ్యాహ్నం ఒంటి గంట అయితే కుమారి ఆంటీ ఫుడ్ ట్రక్ వద్ద విపరీతమైన రద్దీ ఉంటుంది. కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ తో సంపాదిస్తుంటే, కుమారి ఆంటీ ఫుడ్ ట్రక్ పై వీడియోలు చేస్తున్న యూట్యూబర్లు బ్రహ్మాండంగా వ్యూస్ సంపాదిస్తున్నారు.
అలాంటి కుమారి ఆంటీ ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఆమె నిర్వహిస్తున్న ఫుడ్ ట్రక్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. దీనిపై కుమారి ఆంటీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తాము బండి పెట్టే రోడ్డుపై మిగతా బండ్లను అనుమతించారని, వారు అమ్మకాలు సాగించుకుంటున్నారని, కానీ తమను మాత్రమే అడ్డుకోవడం ఏంటని వాపోయింది. గతంలో కూడా ట్రాఫిక్ పేరుతో తమను అడ్డుకున్నారని, ఆ తర్వాత మళ్లీ అమ్ముకోనిచ్చారని వివరించింది. మరి ఇప్పుడేమైందో అర్థం కావడంలేదని కుమారి ఆంటీ పేర్కొంది.
కొంచెం దారి ఇవ్వండి... మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అని తమ బండి వద్ద గుమికూడే ప్రజలకు తాను ఎప్పుడూ చెబుతుంటానని వెల్లడించింది. ఇప్పుడు ఎంతోమంది కస్టమర్లు ఆకలితో తన ఫుడ్ ట్రక్ వద్దకు వచ్చారని, పోలీసులు అడ్డుకోవడంతో చాలా బాధగా ఉందని తెలిపింది.