Revanth Reddy: సోనియా ఇక్కడ నామినేషన్ వేస్తే తెలంగాణ బిడ్డలు ఎవరూ ఆమెపై పోటీ చేయరని భావిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
- సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశామన్న రేవంత్ రెడ్డి
- నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యేలు తనను కలువవచ్చునని సూచన
- కేసీఆర్‌ను కామారెడ్డిలోనే తెలంగాణ ప్రజలు చిత్తుగా ఓడించారన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని తాము ఏకగ్రీవ తీర్మానం చేశామని... కానీ మీరు (మీడియా) దానికి ఖమ్మం నుంచి అని జత చేశారని... మీకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చిందో మీరే (మీడియా) చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాను ఉద్దేశించి నవ్వుతూ అన్నారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. దానికి ముఖ్యమంత్రి పైవిధంగా స్పందించారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని మాత్రమే తాము తీర్మానం చేశామని... దానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
సోనియా గాంధీ తెలంగాణ నుంచి నామినేషన్ వేస్తే ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తెలంగాణ ప్రజలకు ఇప్పటికే మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. సోనియా నామినేషన్ వేస్తే ఇక్కడి పార్టీలు ఆమెపై పోటీ చేయకుంటే గౌరవం ఇచ్చినట్లవుతుందన్నారు. సోనియా గాంధీపై తెలంగాణ బిడ్డలు ఎవరూ పోటీ చేయరని తాము భావిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. అందరం కలిసి ఆమె ఏకగ్రీవ ఎన్నికకు సహకరిద్దామని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై సీఎం స్పందన
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను కలవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తమ నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యేలు ఎవరు అపాయింటుమెంట్ అడిగినా ఇస్తామన్నారు. నేను లేనిపక్షంలో ఉప ముఖ్యమంత్రి కూడా అందుబాటులో ఉంటారని చెప్పారు. వారు తమ తమ నియోజకవర్గాల ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకు రావొచ్చునని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడించారని... లోక్ సభ ఎన్నికల్లోనూ అదే పునరావృతమవుతుందన్నారు. కేసీఆర్ కామారెడ్డిలోనే చిత్తుగా ఓడిపోయారని గుర్తు చేశారు.