Layoffs 2024: మళ్లీ మొదలైన లేఆఫ్స్.. ఈ ఏడాది జాబ్స్ కోల్పోయేది వీళ్లే!
- ఈ ఏడాది తొలగింపులు ఉంటాయంటున్న ప్రముఖ సంస్థలు
- మధ్యస్థాయి మేనేజ్మెంట్ ఉద్యోగులు, రిమోట్ వర్కర్లకు పొంచి ఉన్న ప్రమాదం
- ఉద్యోగుల్లో ఆందోళన అక్కర్లేదంటున్న నిపుణులు
- సంస్థలు చేపడుతున్న దిద్దుబాటు చర్యలే ప్రస్తుత లేఆఫ్స్ అని వివరణ
- ఆర్థిక రంగ సంకేతాలు సానుకూలంగా ఉన్నాయని భరోసా
కొత్త ఏడాది మొదట్లోనే ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు తొలగింపులు ప్రకటించడం టెక్ రంగంలోని వారికి శరాఘాతంగా మారింది. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న బెంగ మొదలైంది. గత కొన్ని వారాలుగా ఆల్ఫబెట్, అమెజాన్, సిటీగ్రూప్, ఈబే, మేసీస్, మైక్రోసాఫ్ట్, షెల్, స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్, వేఫెయిర్ వంటి అమెరికా కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులను తొలగించబోతున్నట్టు ప్రకటించాయి. ఇక యునైటెడ్ పార్సెల్ సర్వీస్..12 వేల మందిని తొలగిస్తామని మంగళవారం ప్రకటించింది.
ఓవైపు టెక్ కంపెనీలు ఇలాంటి ప్రకటనలు చేస్తుంటే మార్కెట్లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికాలో జాబ్ ఓపెనింగ్స్ మూడు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. వినియోగదారుల డిమాండ్ సూచీలు కూడా 2005 నాటి గరిష్ఠానికి చేరుకున్నాయి.
అత్యధిక ప్రభావం వీరిపైనే..
ప్రస్తుతం జాబ్ మార్కెట్లో పరిస్థితులపై ఆర్థికవేత్తలు, రిక్రూటర్లు, కన్సల్టెంట్లు ఇతర పరిశీలకులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మధ్యస్థాయి మేనేజ్మెంట్లో ఉన్న ఉద్యోగులు, వర్క్ ఫ్రం హోం చేసేవారికే లేఆఫ్స్ ప్రమాదం ఎక్కువగా ఉందని స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నాల్లో ఉన్న కంపెనీలు రిమోట్ వర్కర్లను టార్గెట్ చేయడంలో ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. కంపెనీకి ఓ ఉద్యోగి ఎంత ఆదాయం సమకూరుస్తున్నాడు? భవిష్యత్తులోనూ అతడు సంస్థకు ఉపయోగపడతాడా? అన్న కోణంలోంచే సంస్థలు లేఆఫ్స్ చేపడతాయని చెబుతున్నారు
పరిష్కారం ఇదే..
లేఆఫ్స్ తప్పించుకోవాలంటే ఉద్యోగులు రిమోట్ వర్క్‌కు ముగింపు పలకాలని అంటున్నారు. వర్క్ ఫ్రం హోం శకం ముగిసిందన్న విషయాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా, మేనేజ్మెంట్తో మంచి సంబంధబాంధవ్యాలు కలిగుండటం, నెట్వర్కింగ్ ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కీలకమని చెబుతున్నారు. మార్పును ఉత్సాహంగా స్వీకరించాలని కూడా సూచిస్తున్నారు.
ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం, ఆర్థికరంగంలో సానుకూల సంకేతాలు ఉన్నంత వరకూ ఉద్యోగుల తొలగింపుల గురించి ఆందోళన చెందక్కర్లేదు. ప్రస్తుతం లేబర్ మార్కెట్లో ఐటీ, ఫైనాన్స్ రంగాల్లోని వైట్ కాలర్ ఉద్యోగులే లేఆఫ్స్ ప్రమాదం ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. బ్లూ కాలర్ జాబ్స్‌కు వచ్చిన ప్రమాదమేమీ లేదని అంటున్నారు.
ప్రస్తుత లేఆఫ్స్ కూడా అంత అసాధారణమేమీ కాదనేది పరిశీలకుల అభిప్రాయం. గతంలో చూసిన తొలగింపుల కంటే భిన్నమైనవి కావని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ‘‘సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో తొలగింపులు ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్సియల్ స్టేట్మెంట్స్ను సంస్థలు మెరుగుపరుస్తాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సిద్ధమయ్యే క్రమంలో తొలగింపులు ఉంటాయి’’ అని ఓ కన్సల్టెంట్ సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. జాబ్ మార్కెట్లో ఇలాంటి ఒడిదుడుకులు సహజమేనని భరోసా ఇచ్చారు. ప్రస్తుత లేఆఫ్స్.. సంస్థలు చేపడుతున్న దిద్దుబాటు చర్యలని, లాభాపేక్షతో చేస్తున్నవి కావని అన్నారు. కరోనా సంక్షోభం సమయంలో అనేక సంస్థలు పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాయని, వాటి నుంచి బయటపడే క్రమంలో ఈ లేఆఫ్స్‌కు తెరతీశాయని చెబుతున్నారు. తాజా పరిస్థితులు ఏఐ వంటి రంగాల్లో కొత్త ఉపాధి అవకాశాలకూ ద్వారాలు తెరుస్తాయని అంటున్నారు.