Hemant Soren: హేమంత్ సోరెన్ అరెస్ట్.. 7 గంటల సేపు విచారించిన ఈడీ
- హేమంత్ సోరెన్ పై ల్యాండ్ స్కామ్ ఆరోపణలు
- సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే అరెస్ట్ చేసిన ఈడీ
- ఈడీ సమన్లపై హైకోర్టును ఆశ్రయించిన సోరెన్
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు... వెంటనే ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. దాదాపు 7 గంటల సేపు సోరెన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. సీఎం పదవికి సోరెన్ రాజీనామా చేసిన నిమిషాల వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేఎంఎం సీనియర్ నేత, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి చంపయ్ సోరెన్ సీఎం బాధ్యతలను స్వీకరించనున్నారు. హేమంత్ సోరెన్ స్థానంలో ఆయన భార్య సీఎం బాధ్యతను స్వీకరిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ... చివరకు చంపయ్ సోరెన్ ను ఎంపిక చేశారు.
భూకుంభకోణానికి పాల్పడినట్టు హేమంత్ పై ఈడీ అభియోగాలు మోపింది. మనీలాండరింగ్ కేసులో ఆయనకు ఈడీ మూడు సార్లు సమన్లు జారీ చేసింది. మూడు సార్లు కూడా సమన్లకు సోరెన్ స్పందించలేదు. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ జరిగింది. మరోవైపు తనకు ఈడీ సమన్లు జారీ చేయడంపై హైకోర్టులో సోరెన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం 10.30 గంటలకు సోరెన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరపనుంది.