Budget: బడ్జెట్ స్పీచ్.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
- యువతకు రూ.25 లక్షల కోట్లు ముద్రా రుణాలు
- స్టార్టప్ ఇండియా ద్వారా పారిశ్రామికవేత్తలుగా మార్చాం
- గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం ఇళ్లు మహిళల పేరుమీదే ఇచ్చామన్న కేంద్ర మంత్రి
కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ దేశాలు చాలా వరకు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మన దేశం మాత్రం నిలకడగా అభివృద్ధి వైపు సాగిపోతోందని చెప్పారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.
స్టార్టప్ ఇండియా ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ముద్రా యోజన ద్వారా యువతకు ఇప్పటి వరకు రూ.25 లక్షల కోట్లు రుణాలుగా అందించామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు పీఎం ఆవాస్ యోజన పథకంలో పెద్ద పీట వేశామని, లబ్దిదారులలో 70 శాతం మంది మహిళల పేర్లపైనే ఇళ్లు అందజేశామని నిర్మల వివరించారు. మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను తీర్చేందుకు తమ ప్రభుత్వం పాటుపడుతోందని వివరించారు. వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద 2 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని మంత్రి చెప్పారు.