Budget: బడ్జెట్ 2024: కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్
- సోలార్ రూఫ్ టాప్ ద్వారా అందిస్తామని మంత్రి ప్రకటన
- సోలార్ విద్యుత్ గ్రిడ్ కోసం రూ.8,500 కోట్లు కేటాయింపు
- సంక్షేమ పథకాల్లో ఉపాధి హామీకి రూ.86 వేల కోట్లు
దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు సౌర విద్యుత్ వెలుగులు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సౌర విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించడంతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. రూఫ్ టాప్ సోలారైజేషన్ ద్వారా ఉచితంగా విద్యుత్ అందిస్తామని మంత్రి తెలిపారు. సోలారైజేషన్ ద్వారా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు ఆదా అవుతుందని వివరించారు. అంతేకాదు, రూఫ్ టాప్ సోలారైజేషన్ ద్వారా ఉత్పత్తి అయినదాంట్లో మిగులు విద్యుత్ ను డిస్కమ్ లకు విక్రయించవచ్చని తెలిపారు. ఇందులో భాగంగా సోలార్ విద్యుత్ గ్రిడ్ ఏర్పాటు కోసం ఈ బడ్జెట్ లో రూ.8,500 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు.
వివిధ సంక్షేమ, ఇతర పథకాలకు కేటాయింపులు..
గ్రామీణ ఉపాధి హామీ: రూ.86 వేల కోట్లు
ఆయుష్మాన్ భారత్: రూ.7,500 కోట్లు
పారిశ్రామిక ప్రోత్సాహకాలు: రూ.6,200 కోట్లు
సెమీ కండక్టర్స్, డిస్ప్లే ఎకో వ్యవస్థల తయారీ: రూ.6,903 కోట్లు
గ్రీన్ హైడ్రోజన్ మిషన్: రూ.600 కోట్లు