Narendra Modi: నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందన
- దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్న ప్రధాని
- 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారెంటీ అన్న ప్రధాని
- యువత ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్న నరేంద్ర మోదీ
- పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ.1 లక్ష కోట్ల నిధి ఏర్పాటు, స్టార్టప్‌లకు పన్ను మినహాయింపు చేస్తున్నట్లు వెల్లడి
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. వికసిత్ భారత్‌కు మూలస్తంభాలైన పేదలు, యువత, మహిళలు, అన్నదాతల సాధికారతకు ఈ బడ్జెట్ కృషి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారెంటీ అని కొనియాడారు.
ఈ బడ్జెట్ నిర్ణయాలు 21వ శతాబ్దపు అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా యువతకు ఎన్నో కొత్త కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు దారితీస్తాయని పేర్కొన్నారు. యువత ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. ఈ దిశగా రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ. 1 లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేయడం, స్టార్టప్‌లకు పన్ను మినహాయింపును పెంచడం జరిగిందన్నారు.