Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో కీలక పరిణామం... కేసులు కొట్టివేసిన నాంపల్లి కోర్టు
- కొన్నాళ్ల కిందట టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం
- అప్పట్లో సిట్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
- సినీ ప్రముఖుల గోర్లు, తల వెంట్రుకలు సేకరించిన ఎక్సైజ్ శాఖ
- ఫోరెన్సిక్ నివేదికలు, సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు
- సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేవన్న న్యాయస్థానం
- 8 కేసుల్లో 6 కేసుల కొట్టివేత
టాలీవుడ్ లో కొన్నాళ్ల కిందట రేగిన డ్రగ్స్ కలకలం తాలూకు ప్రకంపనలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, నేడు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశానికి సంబంధించి నమోదు చేసిన ఎనిమిది కేసుల్లో 6 కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.
అప్పట్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నెలల తరబడి టాలీవుడ్ ప్రముఖులను విచారించారు. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టి, నటి రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు కూడా జారీ చేసింది.
ఈ కేసులో పూరీ జగన్నాథ్, తరుణ్, చార్మీ తదితరులు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. పలువురు నటుల నుంచి గోర్లు, తల వెంట్రుకలు కూడా సేకరించిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపింది.
ఈ నేపథ్యంలో, ఫోరెన్సిక్ నివేదిక, సాక్ష్యాలను పరిశీలించిన నాంపల్లి కోర్టు... ఆరు కేసుల్లో సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేవంటూ కేసులు కొట్టివేసింది. డ్రగ్స్ కేసు విచారణలో సరైన విధానం పాటించలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.