Anand Mahindra: ఇలాంటి రోబోలు తయారుచేసే స్టార్టప్ లలో పెట్టుబడికి రెడీ: ఆనంద్ మహీంద్ర
- నదిలో చెత్తను తొలగిస్తున్న రోబో.. వీడియో ట్వీట్ చేసిన మహీంద్ర గ్రూప్ చైర్మన్
- మన దేశానికి ఈ రోబోల అవసరం ఎంతో ఉందని వ్యాఖ్య
- ట్విట్టర్ లో 11 మిలియన్లు దాటిన ఆనంద్ మహీంద్ర ఫాలోవర్లు
దేశంలో పెరిగిపోతున్న కాలుష్యంపై ఆందోళన వ్యక్తంచేస్తూ.. టెక్నాలజీతో పరిష్కార మార్గం వెతకాలని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ విభిన్న ట్వీట్లతో ఆయన నెటిజన్లను పలకరిస్తుంటారు. తాజాగా మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఓ నదిలో తనకుతానుగా చెత్తను శుభ్రం చేస్తున్న రోబో వీడియోను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో పంచుకున్నారు. ఇలాంటి రోబోల అవసరం మన దేశానికి చాలా ఉందని వ్యాఖ్యానించారు.
వీడియోలో కనిపిస్తున్న రోబో చైనాలో తయారైనట్లుందని చెబుతూ.. ఇలాంటి రోబోల అవసరం మన దేశానికి ఎంతగానో ఉందని తెలిపారు. ఈ తరహా రోబోలను మనం కూడా ఇప్పటికిప్పుడే తయారు చేసుకోవాలని అన్నారు. ఇప్పటికే ఇలాంటి రోబోలను తయారు చేస్తున్న.. తయారు చేసేందుకు కృషి చేస్తున్న స్టార్టప్ లకు తాను అండగా ఉంటానని చెప్పారు. పూర్తి వివరాలతో తనను సంప్రదిస్తే అవసరమైన పెట్టుబడి పెట్టేందుకు తాను సిద్దమని ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు.
ట్విట్టర్లో 11 మిలియన్ల ఫాలోవర్లు..
సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ లో ఆనంద్ మహీంద్ర ఫాలోవర్ల సంఖ్య పదకొండు మిలియన్లు దాటింది. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్ర శుక్రవారం ఉదయం మరో ట్వీట్ చేశారు. న్యూమరాలజీలో పదకొండు నెంబర్ కు విశేష ప్రాధాన్యం ఉందని చెబుతూ పదకొండు మిలియన్ల మంది స్నేహితుల బృందంలో భాగమైనందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు. తన ఫాలోవర్లకు ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్ర ధన్యవాదాలు తెలిపారు.