Nara Bhuvaneswari: నెల్లూరు రూరల్ కస్తూరి గార్డెన్స్ నుండి ప్రారంభమైన నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర
- నేడు వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో నిజం గెలవాలి యాత్ర
- పలువురు కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ
- రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం
టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో 'నిజం గెలవాలి' యాత్ర చేపట్టారు. ఈ ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం కస్తూరి గార్డెన్స్ నుంచి 'నిజం గెలవాలి' యాత్రను కొనసాగించారు. తన పర్యటనలో భాగంగా పలువురు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు.
తొలుత ఆత్మకూరు నియోజకవర్గం అల్లిపురం గ్రామంలో కార్యకర్త కముజుల ఆంజనేయరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించిన వారిలో ఆంజనేయరెడ్డి ఒకరు. 'నిజం గెలవాలి' యాత్ర సందర్భంగా ఆంజనేయరెడ్డి చిత్రపటానికి నారా భువనేశ్వరి నివాళులు అర్పించారు.
భువనేశ్వరిని చూసి ఆంజనేయరెడ్డి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. భువనేశ్వరి ఈ సందర్భంగా ఆంజనేయరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి రూ.3 లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు.
అనంతరం, వెంకటగిరి నియోజకవర్గం కలువాయి గ్రామంలో కార్యకర్త బొలిగర్ల చెన్నయ్య కుటుంబాన్ని పరామర్శించారు. చెన్నయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. చెన్నయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. భువనేశ్వరి రాకతో చెన్నయ్య కుటుంబ సభ్యులు భావోద్వేగాలకు లోనయ్యారు. వారిని భువనేశ్వరి ఓదార్చి ధైర్యం చెప్పారు. పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చెన్నయ్య కుటుంబానికి రూ.3 లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు.
నేటితో నారా భువనేశ్వరి ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల 'నిజం గెలవాలి' పర్యటన ముగియనుంది. ఈ సాయంత్రం ఆమె రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాదుకు తిరిగి వెళ్లనున్నారు.
నారా భువనేశ్వరికి వినూత్న రీతిలో సంఘీభావం
'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గానికి వచ్చిన నారా భువనేశ్వరికి వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు మండలం పెనుబర్తి గ్రామస్తులు వినూత్న రీతిలో సంఘీభావం ప్రకటించారు. పూలతో 'నిజం గెలవాలి' అని రాశారు. బంతి పూలతో ఏపీ మ్యాప్ ను వేసి, దాని మధ్యలో ఎర్ర గులాబీలతో 'నిజం గెలవాలి' అని రాశారు. అటుగా వెళుతున్న నారా భువనేశ్వరిని ఆపి తమ సంఘీభావం తెలిపారు. పెనుబర్తి గ్రామస్తుల అభిమానానికి ఆమె కదిలిపోయారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.