Revanth Reddy: నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి
- మల్లు భట్టి, కొండా సురేఖ, సీతక్కతో కలిసి నాగోబా ఆలయంలో రేవంత్ రెడ్డి పూజలు
- ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు వేడ్మ బొజ్జు, ప్రేమ్ సాగర్
- ఇంద్రవెల్లిలో లక్షమందితో భారీ బహిరంగ సభ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. దాదాపు లక్ష మంది వరకు ఈ సభకు హాజరవుతారని అంచనా. ఈ సభ కోసం ఆయన హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క తదితరులతో కలిసి నాగోబా ఆలయంలో పూజలు నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో తలపై కండువా చుట్టుకొని దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు ఎమ్మెల్యేలు వేడ్మ బొజ్జు, ప్రేమ్ సాగర్లు స్వాగతం పలికారు.
నేటి నుంచి మరో రెండు గ్యారెంటీ హామీల అమలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభ వేదిక మీదుగా ఈ రోజు మరో రెండు గ్యారెంటీ పథకాల అమలును ప్రకటించనున్నారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ వినియోగం, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలపై అమలుకు సంబంధించి సీఎం ప్రకటన చేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ రోజు నుంచే ఇవి అమలవుతాయని రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.