Revanth Reddy: త్వరలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్: సీఎం రేవంత్ రెడ్డి
- రూ.1200గా ఉన్న గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తామన్న రేవంత్ రెడ్డి
- ప్రియాంక గాంధీతో పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడి
- ఉచిత బస్సు పథకం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు నొప్పి ఎందుకో అర్థం కావడం లేదని విమర్శ
త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. కేస్లాపూర్‌లోని నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం రూ.1200గా ఉన్న గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందిస్తామని పునరుద్ఘాటించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు నొప్పి ఎందుకో అర్థం కావడం లేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తక్కువ వడ్డీకే రుణాలు అందించారని గుర్తు చేశారు.
దీపం పథకం ద్వారా మీకు కాంగ్రెస్ ప్రభుత్వం సిలిండర్, గ్యాస్ పొయ్యి ఇచ్చిందని... అప్పుడు సిలిండర్ ధర రూ.400 మాత్రమే ఉండేదని... కానీ ఆ తర్వాత నరేంద్ర మోదీ, కేసీఆర్ కలిసి రూ.1200కు పెంచారని ఆరోపించారు. ఈ రోజు సిలిండర్ కొనే పరిస్థితి లేదని... అందుకే మహిళలను కష్టాల నుంచి బయటకు తీసుకు రావడానికి రూ.500కే సిలిండర్ ఇస్తామన్నారు. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతికేందుకు ఈ పథకం తీసుకు వస్తున్నామన్నారు. రూ.500కే సిలిండర్ త్వరలో అమలు కాబోతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రియాంక గాంధీని రప్పించి ఈ పథకాన్ని ప్రారంభిద్దామన్నారు. త్వరలో 200 యునిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు.