Under-19 World Cup: అండర్-19 వరల్డ్ కప్: కొనసాగుతున్న భారత్ జైత్రయాత్ర... నేపాల్ పై విజయంతో సెమీస్ బెర్తు ఖరారు
- దక్షిణాఫ్రికాలో అండర్-19 వరల్డ్ కప్
- బ్లూంఫోంటీన్ లో భారత్ × నేపాల్
- 132 పరుగుల తేడాతో గెలిచిన భారత్
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ జోరు కొనసాగుతోంది. సూపర్ సిక్స్ దశలోనూ భారత కుర్రాళ్ల జట్టు ఎదురులేకుండా ముందుకు సాగుతోంది. ఇవాళ బ్లూంఫోంటీన్ లో నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 132 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 297 పరుగులు చేశారు. సచిన్ దాస్ (116), కెప్టెన్ ఉదయ్ సహారన్ (100) సెంచరీలతో మెరిశారు.
అనంతరం 298 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన నేపాల్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో కెప్టెన్ దేవ్ ఖనాల్ చేసిన 33 పరుగులే అత్యధికం. చివర్లో దుర్గేశ్ గుప్తా (29 నాటౌట్), ఆకాశ్ చంద్ (19) పోరాడడంతో నేపాల్ ఆలౌట్ కాకుండా తప్పించుకుంది.
భారత బౌలర్లలో సౌమీ పాండే 4 వికెట్లతో నేపాల్ ను దెబ్బతీశాడు. అర్షిన్ కులకర్ణి 2, రాజ్ లింబాని 1, ఆరాధ్య శుక్లా 1, మురుగన్ అభిషేక్ 1 వికెట్ తీశారు.