Nobel worlds records: 6 నెలల చిన్నారికి అద్భుత జ్ఞాపక శక్తి.. నోబెల్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు
- అద్భుతం చేసిన కృష్ణాజిల్లా యనమలకుదురు చిన్నారి జైత్రి
- వంద రకాల మొక్కలను గుర్తిస్తున్న వైనం
- మొక్క పేరు చెప్పగానే ఫ్లాష్‌కార్డు ఆల్బమ్‌లో మొక్కను గుర్తిస్తున్న చిన్నారి
- చిట్టి పాప ప్రతిభ చూసి బంగారు పతకం ఇచ్చిన నోబెల్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ
కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఆరు నెలల చిన్నారి తన అద్భుత జ్ఞాపకశక్తితో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఏకంగా ‘నోబెల్ వరల్డ్ రికార్డ్స్’ సంస్థ గుర్తింపు దక్కించుకుంది. యనమలకుదురుకు చెందిన ఇడుపులపాటి నితిన్, తనూజ దంపతులు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి అయిదు నెలల కుమార్తె ఉంది. చిన్నారి పేరు జైత్రి.
చిన్నారి పుట్టిన కొన్ని రోజులకే ఆమె అద్భుత జ్ఞాపక శక్తిని తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో, పాపకు రకరకాల మొక్కలు చూపిస్తూ వాటి సాధారణ పేర్లతో పాటూ శాస్త్రీయ నామాలను చెప్పడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకే పాప వంద రకాల మొక్కలను గుర్తు పట్టడం నేర్చుకుంది. మొక్క పేరు చెప్పగానే వెంటనే ఫ్లాష్‌కార్డ్ ఆల్బమ్‌లోని వాటి చిత్రాలను ఇట్టే గుర్తిస్తోంది. ఇది తెలిసిన హైదరాబాదీ సంస్థ నోబెల్ వరల్డ్ రికార్డ్స్.. పాప ప్రతిభను పరీక్షించి ప్రశంసాపత్రంతో పాటూ బంగారు పతకాన్ని అందజేసింది. దీంతో, చిన్నారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.