Tahasildar: తహసీల్దార్ హత్య కేసులో నిందితుడ్ని గుర్తించాం: విశాఖ సీపీ రవిశంకర్
- విశాఖ జిల్లాలో తహసీల్దార్ దారుణ హత్య
- రియల్ ఎస్టేట్, భూ వివాదాలే కారణమన్న విశాఖ సీపీ
- నిందితుడు విమానం ఎక్కినట్టు తెలిసిందని వెల్లడి
- త్వరలోనే పట్టుకుంటామని వివరణ
విశాఖ జిల్లా చినగదిలి తహసీల్దార్ రమణయ్యను ఇనుపరాడ్లతో కొట్టి దారుణంగా హత్య చేయడం తెలిసిందే. ఈ హత్య కేసుపై విశాఖ సీపీ రవిశంకర్ అయ్యర్ మీడియాకు వివరాలు తెలిపారు.
తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో ఇద్దరు ఏసీపీలను, నలుగురు ఇన్ స్పెక్టర్లను నియమించి కేసు దర్యాప్తు చేపట్టామని వివరించారు. రియల్ ఎస్టేట్, భూ వివాదాలే హత్యకు కారణమని స్పష్టం చేశారు.
ఈ కేసులో నిందితుడ్ని గుర్తించామని వెల్లడించారు. రమణయ్యపై దాడి అనంతరం నిందితుడు ఎయిర్ పోర్టు వైపు వెళ్లినట్టు గుర్తించామని విశాఖ సీపీ పేర్కొన్నారు. నిందితుడు విమానం ఎక్కినట్టు తెలిసిందని వివరించారు.
విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజి పరిశీలించామని, రమణయ్య విశాఖ రూరల్ ఎమ్మార్వోగా పనిచేసినప్పుడు... నిందితుడు పలుమార్లు ఆయన కార్యాలయానికి వెళ్లినట్టు విజువల్స్ ఉన్నాయని తెలిపారు. త్వరలోనే నిందితుడ్ని పట్టుకుంటామని చెప్పారు.