High Speed Trains: భారత్ లోనూ హైస్పీడ్ రైళ్లు... శంషాబాద్ నుంచి నాలుగున్నర గంటల్లో విశాఖ!

High Speed trains run soon in India

  • ఇప్పటికే భారత్ లో వందే భారత్ రైళ్లు
  • వందే భారత్ రైళ్ల వేగం గంటకు 160 కి.మీ
  • గంటకు 220 కి.మీ వేగంతో ప్రయాణించనున్న హైస్పీడ్ రైళ్లు
  • హైదరాబాద్-విశాఖ... కర్నూలు-విజయవాడ రూట్లలో ప్రతిపాదనలు

భారత్ లోనూ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటికే వందేభారత్ రూపంలో సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వందే భారత్ రైళ్ల వేగం గంటకు 160 కిలోమీటర్లు కాగా... కొత్తగా ప్రవేశపెట్టబోయే హైస్పీడ్ రైళ్ల వేగం గరిష్ఠంగా 220 కిలోమీటర్లు. ఈ రైలు శంషాబాద్ నుంచి విశాఖకు నాలుగున్నర గంటల్లో చేరుకుంటుంది. 

అయితే, ఈ హైస్పీడ్ రైళ్ల కోసం ఇప్పుడున్న రైల్వే లైన్లు అనువుగా ఉండవు. ఎంతో వేగంగా వెళ్లే ఈ రైళ్ల కోసం ట్రాక్ కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఈ నేపథ్యంలో, దేశంలోని పలు రూట్లలో హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందులో ఏపీ, తెలంగాణలో రెండు రూట్లు ఉన్నాయి. 

హైదరాబాద్-విశాఖపట్నం... కర్నూలు-విజయవాడ రూట్లలో హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి చేపట్టిన ప్రాథమిక సర్వే చివరి దశలో ఉంది. ప్రాథమిక ఇంజినీరింగ్, ట్రాఫిక్ సర్వే రిపోర్ట్ కూడా వస్తే, తదనంతరం డీపీఆర్ ప్రక్రియ చేపట్టనున్నారు.

కాగా, ఈ ప్రాజెక్టు వ్యయం రూ.20 వేల కోట్లు కాగా... హైస్పీడ్ రైళ్లు ప్రయాణించేందుకు ఎలివేటెడ్ కారిడార్ ట్రాక్ లు ఏర్పాటు చేస్తే ఆ బడ్జెట్ ఇంకా పెరగనుంది. ఇప్పటికే ప్రాథమిక సర్వేలో ఎక్కడెక్కడ బ్రిడ్జిలు నిర్మించాలి, ఎక్కడెక్కడ ఇతర నిర్మాణాలు చేపట్టాలి అనేది పరిశీలించారు. మరో ఐదారు సంవత్సరాల్లో ఈ హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News