Harish Rao: పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదు: హరీశ్ రావు
- కృష్ణా నదీ ప్రాజెక్టుల అంశంలో బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ విమర్శలు
- రేవంత్ టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదన్న హరీశ్ రావు
- హామీలు అమలు చేయలేక సాకులు చెబుతున్నారని విమర్శలు
కృష్ణా నదీ జలాల్లో ఏపీకి అధిక వాటా దక్కడానికి కేసీఆర్, హరీశ్ రావే కారణమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం తెలిసిందే. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపునకు కేసీఆర్, హరీశ్ రావు ఏపీకి సహకరించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు.
పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. రేవంత్ టీడీపీలో ఉన్నప్పుడు దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. రేవంత్ రెడ్డి విషయం లేకనే విషం చిమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయలేక సాకులు చెబుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేశాకే లోక్ సభ ఎన్నికల్లో ఓటు అడగాలని పేర్కొన్నారు.
ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమని హరీశ్ రావు స్పష్టం చేశారు. అసెంబ్లీలో దిమ్మదిరిగే జవాబు ఇస్తామని అన్నారు. నాడు కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు తాము ఒప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఉద్ఘాటించారు.
ఇప్పుడు కేంద్రం ఒత్తిడితో ప్రాజెక్టుల అప్పగింతకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఒప్పుకుందని ప్రత్యారోపణలు చేశారు. విభజన చట్టం బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాదులో ఇవాళ జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో హరీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.