Pawan Kalyan: సొంత చెల్లెల్ని తిట్టేవారిని ప్రోత్సహిస్తున్న జగన్ అర్జునుడా?: పవన్ కల్యాణ్
- పవన్ సమక్షంలో జనసేనలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- ఈ సందర్భంగా పవన్ ఆసక్తికర ప్రసంగం
- మంచితనానికి మారుపేరు అంటూ సీఎం జగన్ పై సెటైర్లు
- అర్జునుడు ఆడవాళ్లను రక్షించాడే తప్ప తూలనాడలేదని వెల్లడి
వైసీపీకి గుడ్ బై చెప్పిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఈ సాయంత్రం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచితనానికి మారుపేరు, నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం లాంటి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు.
"వారి బాధ నిన్న వర్ణనాతీతం. ఆయన చాలా బాధపడిపోతున్నారు. ఆయనను అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నట్టు, ఆయనొక అర్జునుడులాగా, మేమందరం కౌరవుల్లాగా, ప్రజలే ఆయన ఆయుధాలు అని, ప్రజలే ఆయనకు శ్రీకృష్ణుడు అని మాట్లాడుతోంటే చాలా అసహ్యంగా ఉంటోంది.
అర్జునుడు ఆడవాళ్లను రక్షించాడే తప్ప, తూలనాడలేదు. జగన్ తనను తాను అర్జునుడితో పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉంది. సొంత చెల్లెలు షర్మిల గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే, అలా తిట్టేవారిని ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను. అతను అర్జునుడుతో పోల్చుకుంటున్నాడు.
తోడబుట్టిన చెల్లెలికి గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సొంత బాబాయ్ ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు... వాళ్లను వెనకేసుకొచ్చే వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని వివేకా కూతురు డాక్టర్ సునీత చెబుతుంటే, ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. ఎవరు అర్జునుడో, ఎవరు కౌరవులో నేను మహాభారతం స్థాయికి వెళ్లి మాట్లాడదలుచుకోలేదు.
ఇది కలియుగం. అందులో ఒకటో పాదమో, రెండో పాదమో తెలియదు కానీ... మనం ఎవ్వరం కూడా శ్రీకృష్ణుడితో, అర్జునుడితో, కౌరవులతో పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ... నేను పవన్ కల్యాణ్, మాది జనసేన. ఎవరు మంచి వాళ్లు, ఎవరు అండగా నిలుస్తారు, ఎవరు దోపిడీదారులో ప్రజలకు బాగా తెలుసు. స్వగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
నేను ఏ రోజూ కూడా ఆయనను తగ్గించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ సొంత చెల్లెలికి గౌరవం ఇవ్వలేని వాడు, మనింట్లో ఆడపడుచులకు గౌరవం ఇస్తాడని నేను అనుకోవడంలేదు. వైసీపీ ఉన్న చోటే ఇంత దిగజారుడు రాజకీయం ఉంటుంది. దేశంలో ఇంత దిగజారుడు రాజకీయం ఎక్కడా చూడలేదు.
నన్ను వ్యక్తిగతంగా ఎన్నిసార్లు తిట్టినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎందుకు బాధ్యతగా ఉన్నానంటే, రాబోయే తరాలకు ఎంతో కొంత విలువలతో కూడిన రాజకీయం చూపించడానికి" అంటూ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఇక, పవర్ స్టార్, పవర్ స్టార్ అంటారు... పవర్ లేని వాడికి పవర్ స్టార్ బిరుదు ఎందుకు? అని వ్యాఖ్యానించారు. పవర్ స్టార్ అనే పదం తనకు ఎబ్బెట్టుగా ఉంటుందని, తనను ప్రజల మనిషి అనుకోవడమే ఇష్టమని పేర్కొన్నారు. అందుకే సినిమాల్లో కూడా ఆ పదం వాడనని వెల్లడించారు.