New Delhi: తల్లిపై కోపంతో.. చెల్లి పెళ్లికని దాచిన నగలు దొంగిలించిన అక్క!

Delhi Woman Robs Own Home Steals Jewellery Meant For Sisters Wedding

  • న్యూఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఘటన
  • తల్లి వద్ద ఇంటి తాళం దొంగిలించి చోరీకి పాల్పడ్డ యువతి
  • పోలీసుల దర్యాప్తులో బండారం బట్టబయలు
  • తల్లిపై కోపం, అప్పులు తీర్చేందుకు చోరీ చేశానని అంగీకరించిన యువతి

తల్లికి తనకంటే చెల్లే ఎక్కువ ఇష్టమని కోపం, కక్ష పెంచుకున్న ఓ యువతి చివరకు తల్లి ఇంట్లోనే చోరీకి పాల్పడింది. చెల్లి పెళ్లికని ఇంట్లో దాచిన లక్షల విలువైన నగలు, నగదు దొంగిలించింది. ఢిల్లీలో జనవరి 30న ఈ ఘటన జరగ్గా పోలీసులు తాజాగా నిందితురాలితో నిజం కక్కించారు. 

ఉత్తమ్‌నగర్‌లోని సేవక్ పార్క్ ప్రాంతంలో కమ్లేశ్ అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటోంది. ఇటీవలే పెద్ద కూతురు మరో ఇంటికి మారింది. కాగా, జనవరి 30న తన ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్షల విలువైన నగలు, రూ.25 వేల నగదు చోరీ అయినట్టు తెలిపింది. మహిళ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులకు ఆమె ఇంట్లో అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదు. తాళాలు గట్రా యథాతథంగా ఉండటంతో వారు స్థానిక సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ క్రమంలో ఓ మహిళ బుర్ఖా ధరించి కమ్లేశ్ ఇంట్లోకి ప్రవేశించినట్టు గుర్తించారు. చివరకు పోలీసులు బుర్ఖాలోని మహిళను కమ్లేశ్ పెద్ద కూతురు శ్వేతగా గుర్తించారు. 

శ్వేతను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆమె జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది. తల్లికి తనకంటే చెల్లెలిపైనే ఎక్కువ ఇష్టం ఉండటం తనకు ఆగ్రహం కలిగించిందని తెలిపింది. అంతేకాకుండా, తనకు అప్పులు కూడా ఉండటంతో వాటిని తీర్చేందుకు చోరీ చేశానని పేర్కొంది. దొంగతనానికి కొన్ని రోజుల ముందే ఆమె పథకం ప్రకారం, మరో ఇంటికి మారిపోయింది. కొత్త ఇంట్లో కూతురు సెటిలయ్యేందుకు తల్లి కమ్లేశ్ పలు ఏర్పాట్లు చేసింది. చిన్న కూతురు ఆఫీసుకు వెళ్లాక పెద్ద కూతురు ఇంటికి వచ్చి వెళుతుండేది. ఈ క్రమంలో ఓ రోజు తన ఇంటికొచ్చిన తల్లి నుంచి శ్వేత ఇల్లు, కప్‌బోర్డు తాళాలు దొంగిలించింది. ఆ తరువాత కూరగాయలు కొనేందుకని చెప్పి బయటకు వచ్చిన ఆమె ఓ పబ్లిక్ టాయ్‌లెట్‌లో బుర్ఖా ధరించి తల్లి ఇంటికెళ్లి నగలు దొంగిలించింది. నగలు, డబ్బులు పోయాయని ఆ తరువాత తల్లి తనకు చెప్పినా శ్వేత ఏమీ తెలియనట్టు నటించింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగడంతో ఆమె నిజం ఒప్పుకోక తప్పలేదు.

  • Loading...

More Telugu News