Bhongir Hostel: హాస్టల్ విద్యార్థినుల ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. మృతదేహాలపై గాయాలు
- అనుమానాలు వ్యక్తంచేస్తున్న తల్లిదండ్రులు
- హాస్టల్ ముందు ఆందోళన.. విద్యార్థి సంఘాల మద్దతు
- వార్డెన్ సహా ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
భువనగిరి ఎస్సీ హాస్టల్ విద్యార్థినుల మృతి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారని హాస్టల్ వార్డెన్, పోలీసులు చెబుతుండగా.. తమ పిల్లలను హత్య చేశారంటూ బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సూసైడ్ లెటర్ అంటూ పోలీసులు చూపించిన లేఖలోని రాత తమ పిల్లలది కాదని పేరెంట్స్ అంటున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పాటు విద్యార్థినుల మృతదేహాలపై గాయాలు ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని చెప్పారు.
హాస్టల్ వార్డెన్, ఆటో డ్రైవర్ పై అనుమానం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాల నేతలతో కలిసి హాస్టల్ ముందు బాధిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తన కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ చనిపోయిన విద్యార్థినులలో ఒకరైన వైష్ణవి తండ్రి రాజు ఆరోపించారు.
విద్యార్థినుల మృతిపై హాస్టల్ వార్డెన్ సహా మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేశామని భువనగిరి పోలీసులు తెలిపారు. కేసు దర్యాఫ్తు చేస్తున్నామని, విచారణలో అన్ని వివరాలు బయటపడతాయని బాధిత తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటోడ్రైవర్ ఆంజనేయులు, వంట మనుషులు సుజాత, సులోచనలతో పాటు అటు స్కూలు పీఈటీ ప్రతిభ, టీచర్ భువనేశ్వరిపై కేసు పెట్టామని చెప్పారు. వార్డెన్ శైలజ, ఆటోడ్రైవర్ ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.