Hari Ramajogaiah: టీడీపీకి జనసేన ఎన్ని సీట్లు కేటాయిస్తున్నదనేదే ప్రశ్న కావాలి: హరిరామజోగయ్య
- రెడ్డి, కమ్మ సామాజికవర్గాలు బలహీన వర్గాలను ఉపయోగించుకుంటున్నాయన్న జోగయ్య
- జనసేన లేకుండా టీడీపీ గెలవడం కష్టం అని 2019లో తేలిందని వ్యాఖ్య
- వైసీపీని ఓడించడం అంటే.. టీడీపీకి పూర్తి అధికారం కట్టబెట్టడం కాదు కదా అన్న జోగయ్య
టీడీపీ - జనసేన పార్టీలు పొత్తులో ఉన్న సంగతి సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అయితే, జనసేనకు సీట్ల అంశంపై మాజీ ఎంపీ హరిరామజోగయ్య ఇప్పటికే పలు బహిరంగ లేఖలు రాశారు. తాజాగా ఆయన మరో లేఖ రాశారు.
జనసేనకు 30 సీట్లని ఒక ఎల్లో మీడియా, 27 సీట్లని మరో ఎల్లో మీడియా ప్రచారం చేశాయని చెప్పారు. ఎవరిని ఉద్ధరించడానికి ఈ రకమైన ఏకపక్ష వార్తలను ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని అన్నారు. జనాభాలో 6 శాతం ఉన్న రెడ్లు, 4 శాతం ఉన్న కమ్మ కులస్తులు మిగిలిన బలహీన వర్గాలను ఉపయోగించుకుని రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాయని విమర్శించారు. 25 శాతం ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులను బీసీలుగా గుర్తింపు పొందకుండా... విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు పొందకుండా అడ్డుకుంటున్నారని అన్నారు.
వైసీపీని దింపాలంటే జనసేనకు ఇష్టం ఉన్నా, లేకపోయినా టీడీపీతో కలిసి వెళ్లడం తప్పనిసరి అనేది కాదనలేని పరిస్థితి అని చెప్పారు. వైసీపీని అధికారం నుంచి తప్పించడం అంటే.. టీడీపీకి పూర్తి అధికారాన్ని కట్టబెట్టడం కాదు కదా అని అన్నారు. జనసేన లేకుండా టీడీపీ గెలవడం కష్టం అనేది 2019 ఎన్నికల్లో తేలిందని... ఈ నేపథ్యంలో జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందనే ప్రశ్న ఉత్పన్నం కాకూడదని చెప్పారు. టీడీపీకి జనసేన ఎన్ని సీట్లు ఇస్తుందనేదే ప్రశ్న కావాలని అన్నారు. కనీసం 50 సీట్లయినా దక్కించుకుంటేనే... రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా, పాక్షికంగా దక్కే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని మీకు రెండున్నర సంవత్సరాలైనా కట్టబెడుతున్నట్టు ఎన్నికలకు ముందే మీరు చంద్రబాబు నోటి వెంట ప్రకటించగలుగుతారా? అని ప్రశ్నించవలసి వస్తుందని పవన్ ను ఉద్దేశించి అన్నారు.