Vijayasai Reddy: కాంగ్రెస్ పార్టీకి ఈ శిక్ష సరిపోదు... ఇంకా శిక్ష పడాలి: రాజ్యసభలో విజయసాయిరెడ్డి
- రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
- కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన విజయసాయిరెడ్డి
- రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారని ఆగ్రహం
- ఏపీకి కోలుకోలేనంత నష్టం కలుగజేశారని విమర్శలు
- అందుకే ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని వెల్లడి
నాడు ఎన్నికల్లో లబ్ది పొందాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అశాస్త్రీయంగా విభజించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేనంత నష్టం కలుగజేసిందని, అందుకే 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల చేసిన మోసానికి ఆ శిక్ష పడిందని, కాంగ్రెస్ కు ఈ శిక్ష సరిపోదని, ఇంకా శిక్ష పడాలని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీ పాలిట అసలు విలన్ కాంగ్రెస్ పార్టీయేనని, ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పారని, కాంగ్రెస్ కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశానికి ఎందుకు స్థానం కల్పించలేదని విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడం చేతకాని కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు తమను ఎందుకు నిందిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ కు లేదని, కానీ ఎన్నికలు వస్తుండడంతో దీన్నొక ప్రచారం అంశంగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ దుష్పరిపాలన సాగించిందనడానికి ఏపీనే నిదర్శనం అని స్పష్టం చేశారు.