Vijayasai Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం తథ్యం: విజయసాయిరెడ్డి
- రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చ
- కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
- నాడు అడ్డగోలుగా ఏపీని విభజించారని ఆగ్రహం
- తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ గెలవలేకపోయిందని వ్యాఖ్యలు
- ఇప్పుడు అనేక అబద్ధాలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చారని విమర్శలు
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారం విభజించిందని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చాం... రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తామని ఆశించిన కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని విజయసాయి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ కు భంగపాటు తప్పలేదని ఎద్దేవా చేశారు.
పదేళ్ల పాటు నానా బాధలు పడిన కాంగ్రెస్ ఎట్టకేలకు అనేక అబద్ధాలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని అన్నారు. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం నిలబడదని, ప్రభుత్వం కూలిపోవడం తథ్యమని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.