Rahul Dravid: ఈ పిచ్ లు ఏంటో నాకూ అర్థం కావడంలేదు: ద్రావిడ్

Dravid opines on Indian pitches

  • మూడున్నర రోజుల్లోనే ముగిసిన విశాఖ టెస్టు
  • మిగతా టెస్టుల్లోనూ పిచ్ లు ఇలాగే ఉంటాయా అన్న ప్రశ్నకు ద్రావిడ్ స్పందన
  • భారత్ లో పిచ్ లు ఎప్పుడెలా స్పందిస్తాయో చెప్పలేమని వెల్లడి

టీమిండియా-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు మూడున్నర రోజుల్లోనే ముగియడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మరోసారి పిచ్ ల అంశం చర్చకు వచ్చింది. ఈ అంశంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

సొంత గడ్డపై టీమిండియా ఆడే టెస్టు మ్యాచ్ ల కోసం విపరీతంగా స్పిన్ తిరిగే పిచ్ లు కావాలని టీమ్ మేనేజ్ మెంట్ ఎప్పుడూ కోరదని స్పష్టం చేశారు. ఐదు రోజుల పాటు జరిగే టెస్టు మ్యాచ్ లో పిచ్ ఏ రోజు ఎలా స్పందిస్తుందో అంచనా వేయడం ఓ సవాల్ అని అభిప్రాయపడ్డారు. 

ఐదు టెస్టుల సిరీస్ లో మిగిలిన మూడు మ్యాచ్ ల్లోనూ ఇలాంటి పిచ్ లనే చూడబోతున్నామా? అనే ప్రశ్నకు రాహుల్ ద్రావిడ్ స్పందించారు. "పిచ్ లను రూపొందించేది క్యూరేటర్లు. మేమేమీ బంతి గిర్రున తిరిగే పిచ్ లు కావాలని అడగం. సహజంగానే భారత్ లో పిచ్ లు స్పిన్ కు అనుకూలిస్తుంటాయి. 

అయితే, ఫలానా పిచ్ ఎంత స్పిన్ తిరుగుతుంది, ఎక్కువ తిరుగుతుందా, తక్కువ తిరుగుతుందా అనేది చెప్పడానికి నేనేమీ నిపుణుడ్ని కాను. కొన్నిసార్లు... ఈ పిచ్ మూడో రోజు నుంచి స్పిన్ కు అనుకూలిస్తుంది అని చెబుతుంటారు. అలాంటి చోట్ల మొదటి రోజు నుంచే స్పిన్ తిరగడం చూశాను. కొన్నిసార్లు... ఈ పిచ్ పై రెండో రోజు నుంచి బంతి స్పిన్ తిరగడం ప్రారంభిస్తుంది అని చెబుతారు... అలాంటి చోట్ల నాలుగో రోజు కూడా బంతి తిరగకపోవడం నేను గమనించాను. 

మనదేశంలోని పిచ్ లు ఎప్పుడు ఎలా స్పందిస్తాయో, అందరిలాగే నాక్కూడా అర్థం కాదు. ఏ మ్యాచ్ లో అయినా సరే అత్యుత్తమ ఆటతీరు కనబర్చేందుకు ప్రయత్నించడమే మాకు తెలుసు" అని రాహుల్ ద్రావిడ్ వివరించారు.

  • Loading...

More Telugu News