Competitive Exams: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కోటి రూపాయల జరిమానా.. ఐదేళ్ల జైలు శిక్ష!

One crore fine and 5 year jail for malpractice in competitive exams

  • పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2024ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
  • వ్యవస్థీకృత ముఠాలు, మాఫియాపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యం
  • ముఠాలకు సహకరించే ప్రభుత్వ ఉద్యోగులపైనా కఠిన శిక్షలు

పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. అక్రమాలకు పాల్పడుతూ దొరికితే శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడంతోపాటు కోటి రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లు-2024ను నిన్న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఇది అమల్లోకి వస్తే పేపరు లీకేజీకి పాల్పడినా, కాపీ కొట్టినా, నకిలీ వెబ్‌సైట్లు సృష్టించినా కనిష్ఠంగా మూడేళ్ల నుంచి గరిష్ఠంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష‌తోపాటు కోటి రూపాయల జరిమానా విధిస్తారు. 

వ్యవస్థీకృత ముఠాలు, మాఫియాపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. అంతేకాదు, వారితో చేతులు కలిపే ప్రభుత్వ అధికారులు కూడా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజస్థాన్, హర్యానా, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా పోటీ పరీక్షలు వాయిదా పడడంతో కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. యూపీఎస్సీ ఎస్సెస్సీ, ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎన్‌టీఏ వంటి పోటీ పరీక్షలతోపాటు నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి ప్రవేశ పరీక్షలకూ వర్తిస్తుంది.

అసోంలో ఇవే నేరాలకు రూ. 10 కోట్ల జరిమానా
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లాంటి బిల్లునే అసోం ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతూ దొరికితే 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 10 కోట్ల జరిమానా విధిస్తారు. ఇందుకు సంబంధించిన అస్సాం పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు-2024ను నిన్న ముఖ్యమంత్రి హిమంతబిశ్వశర్మ ప్రవేశపెట్టారు.

  • Loading...

More Telugu News