Arvind Kejriwal: కేజ్రీవాల్ చుట్టూ మరింతగా బిగుస్తున్న ఉచ్చు.. వ్యక్తిగత కార్యదర్శి సహా మరికొందరిపై ఈడీ దాడులు
- ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని 12 చోట్ల దాడులు
- మనీలాండరింగ్ కేసులో పట్టుబిగుస్తున్న ఈడీ
- ఐదోసారీ ఈడీ సమన్లను స్కిప్ చేసిన అరవింద్ కేజ్రీవాల్
- ఆ వెంటనే ఈడీ దాడులు
కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తున్న ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ ఉదయం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శితోపాటు ‘ఆప్’తో సంబంధం ఉన్న మరికొందరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు ప్రారంభించింది. నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) పరిధిలోని మొత్తం 12 ప్రాంగణాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్, ఢిల్లీ జల్‌బోర్డ్ (డీజేబీ) మాజీ సభ్యుడు షలభ్ కుమార్‌తో మరికొందరి ప్రాంగణాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే, ఆప్ ట్రెజరర్, రాజ్యసభ సభ్యుడు ఎన్‌డీ గుప్తా ఇంట్లోనూ సోదాలు జరుపుతోంది. మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లను ఐదోసారీ కేజ్రీవాల్ విస్మరించిన తర్వాత ఈ దాడులు జరగడం గమనార్హం.