Zambia: జాంబియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కలరా.. మానవతా సాయం చేసిన భారత్
- గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు 600 మంది మృతి
- 15 వేలమందికిపైగా బాధితులు
- కలరా మందులు, నీటి శుద్ధి యంత్రాలు, ఓఆర్ఎస్ సాచెట్లు పంపిన భారత్
ఆఫ్రికన్ దేశం జాంబియా కలరా మహమ్మారి వలలో చిక్కి విలవిల్లాడుతోంది. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎన్నడూ ఎరుగని విపత్తును ఎదుర్కొంటున్న ఈ చిన్న దేశంలో కలరా కారణంగా అక్టోబరు 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 వేల మందికిపైగా మహమ్మారి వలలో చిక్కారు. దేశంలోని 10 ప్రావిన్సులలో 9 ప్రావిన్సులు కలరా గుప్పిట్లో చిక్కాయి.
గతంలో ఎన్నడూ లేనంతగా ఆరోగ్య సంక్షోభంతో అల్లాడుతున్న జాంబియా పరిస్థితిపై భారత్ స్పందించింది. నీటిశుద్ధి యంత్రాలు, కలరా నివారణ ఔషధాలు, డీ హైడ్రేషన్ బారినుంచి కాపాడే ఓఆర్ఎస్ సాచెట్లు వంటి సామగ్రితో కూడిన 3.5 టన్నుల మానవతా సాయం పంపినట్టు ‘బీబీసీ’ కథనం పేర్కొంది.