Hindu Temple: అరబ్ దేశాల్లో మొట్టమొదటి హిందూ దేవాలయం... ఈ నెల 14న ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- అబుదాబిలో హిందూ దేవాలయం
- 27 ఎకరాల్లో నిర్మితమైన ఆలయం
- సుమారు రూ.700 కోట్లతో నిర్మాణం
అరబ్ దేశాల్లో మొట్టమొదటి హిందూ దేవాలయం త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోనుంది. అబుదాబిలోని అబు మురీఖా వద్ద ఈ భారీ ఆలయం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. బీఏపీఎస్ స్వామి నారాయణ్ సంస్థ ఈ ఆలయ నిర్మాణకర్త. ఈ ఆలయం ఫిబ్రవరి 14న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మహంత్ స్వామి మహరాజ్ సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 13న ఇక్కడి భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగానికి అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా నిలవనుంది.
కాగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పాటు మధ్య ప్రాచ్య దేశాల్లో ఇదే మొదటి హిందూ దేవాలయం కానుంది. 27 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. ఈ ఆలయ బడ్జెట్ సుమారు రూ.700 కోట్లు అని మీడియా కథనాలు చెబుతున్నాయి.
2015లో ప్రధాని మోదీ యూఏఈ పర్యటన సందర్భంగా అక్కడి పాలకులు ఈ ఆలయానికి భూమి కేటాయించారు. 1980లో ఇందిరా గాంధీ పర్యటించిన తర్వాత యూఏఈలో పర్యటించిన భారత ప్రధాని మోదీనే. అందుకే 2015 నాటి మోదీ పర్యటన చారిత్రాత్మకంగా మిగిలిపోయింది.