Manickam Tagore: విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేసిన మాణికం ఠాగూర్
- విజయసాయి తనపై రాజ్యసభలో ఆరోపణలు చేశారన్న మాణికం ఠాగూర్
- లోక్ సభ సభ్యుడి గురించి రాజ్యసభలో మాట్లాడడం సరికాదని వ్యాఖ్య
- ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని స్పష్టీకరణ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ నేడు రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో విజయసాయి తనపై ఆరోపణలు చేశారని మాణికం ఠాగూర్ పేర్కొన్నారు. ఓ లోక్ సభ సభ్యుడి గురించి రాజ్యసభలో మాట్లాడడం సరికాదని అన్నారు. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీని ఎంతమాత్రం ప్రశ్నించడంలేదని మాణికం ఠాగూర్ విమర్శించారు.
2019 నుంచి కేంద్రం తీసుకువచ్చిన అన్ని బిల్లులకు జగన్ మద్దతు ఉందని వెల్లడించారు. అన్ని ప్రజా వ్యతిరేక బిల్లులకు జగన్ మద్దతు ఇచ్చారని ఆరోపించారు. పార్లమెంటులో కేంద్రానికి మద్దతు ఇచ్చే వైసీపీ, బయట మాత్రం వ్యతిరేకిస్తుంటుందని తెలిపారు.
బీజేపీకి జగన్ ఏటీఎంలా మారారని... మోదీ, అమిత్ షాలకు జగన్ లొంగిపోయారని మాణికం ఠాగూర్ విమర్శించారు. కేసుల కోసమే జగన్, విజయసాయి బీజేపీకి లొంగిపోయారని అన్నారు. జగన్ కేంద్రం నుంచి సాధించింది ఏమీ లేదని పేర్కొన్నారు.