King Charles III: బ్రిటన్ కింగ్ చార్లెస్-3కి ‘క్యాన్సర్’పై ప్రధాని రిషి సునాక్ స్పందన
- క్యాన్సర్ సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్టు విచారం వ్యక్తం చేసిన బ్రిటన్ ప్రధాని
- ఆరంభంలోనే గుర్తించడం ఉపశమనం కలిగించే విషయమని వ్యాఖ్య
- కింగ్ చార్లెస్-3 త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని వెల్లడి
బ్రిటన్ రాజు చార్లెస్-3కు క్యాన్సర్ నిర్ధారణ కావడంపై ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ తొలిసారి స్పందించారు. సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని విచారం వ్యక్తం చేశారు. అయితే క్యాన్సర్‌ను ఆరంభంలోనే గుర్తించడం కాస్త ఉపశమనం కలిగించే అంశమని బీబీసీ రేడియతో మాట్లాడుతూ సునాక్ అన్నారు. కింగ్ చార్లెస్‌తో సాధారణ సంభాషణను కొనసాగించనున్నట్టు వెల్లడించారు. కింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
చార్లెస్-3కి క్యాన్సర్ నిర్ధారణ అయ్యిందనే విషయాన్ని దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలు, వ్యక్తులు వింటున్నప్పుడు ఎలాంటి భావం కలుగుతుందో తనకు కూడా అలాగే అనిపిస్తోందని చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటో అందరికీ తెలుసునని, కింగ్ చార్లెస్-3 త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని సునాక్ అన్నారు. కింగ్ ఆరోగ్యం విషయంలో ఆశాజనకంగా ఉన్నామని, వీలైనంత త్వరగా ఆయన క్యాన్సర్ నుంచి బయటపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
కాగా కింగ్ చార్లెస్‌కు ఇటీవల క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. ‘ఎన్‌లార్జ్‌డ్ ప్రొస్టేట్’ చికిత్స కోసం ‘లండన్ క్లినిక్’కి వెళ్లగా క్యాన్సర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ సోమవారం ప్రకటించింది. ఆయన చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. వైద్యుల సూచన మేరకు బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారని వివరించిన విషయం తెలిసిందే.