Under-19 World Cup: అండర్-19 వరల్డ్ కప్: సెమీస్ పోరులో కష్టాల్లో భారత్
- దక్షిణాఫ్రికాలో అండర్-19 వరల్డ్ కప్
- నేడు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెమీస్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా
- ఛేదనలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్
దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్ పోరులో భారత్ కష్టాల్లో పడింది. లక్ష్యఛేదనలో 32 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుంది. దక్షిణాఫ్రికాలోని బెనోనీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. ఓపెనర్ లువాన్ డ్రే ప్రిటోరియస్ 76, రిచర్డ్ సెలెస్ట్ వేన్ 64 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, ముషీర్ ఖాన్ 2, నమన్ తివారీ 1, సౌమీ పాండే 1 వికెట్ తీశారు.
అనంతరం, 245 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ ను సఫారీ పేసర్ ట్రిస్టాన్ లూస్ హడలెత్తించాడు. లూస్ 3 వికెట్లతో భారత్ టాపార్డర్ ను దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (0) డకౌట్ అయ్యాడు. ఈ వికెట్ క్వెనా ఎంఫాకా ఖాతాలో చేరింది. అక్కడ్నించి ట్రిస్టాన్ లూస్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటింగ్ లైనప్ కు పరీక్ష పెట్టాడు. తొలుత ముషీర్ ఖాన్ (4) ను అవుట్ చేసిన లూస్... అదే ఊపులో మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (12), ప్రియాన్షు మోలియా (5)లను పెవిలియన్ చేర్చాడు.
ప్రస్తుతం భారత్ స్కోరు 19 ఓవర్లలో 4 వికెట్లకు 70 పరుగులు. కెప్టెన్ ఉదయ్ సహారన్ 15, సచిన్ దాస్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఇంకా 175 పరుగులు చేయాలి.